Kerala – BJP: కేరళలో కాషాయ వికాసం! వామపక్ష కోటకు బీటలు!!
కేరళ రాజకీయం అంటే దశాబ్దాలుగా మనకు తెలిసిన లెక్క ఒక్కటే. ఒకసారి వాళ్లు.. మరోసారి వీళ్లు! ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) కూటముల చుట్టూనే అక్కడి పాలిటిక్స్ తిరుగుతుంటాయి. కానీ, ఇప్పుడు ఆ పాత ఫార్ములాకు కాలం చెల్లిపోయినట్లు కనిపిస్తోంది. సరిగ్గా మరో మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కేరళలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ఆ రెండు కూటములకే పరిమితమైన కేరళ ఓటరు, ఇప్పుడు బీజేపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాడు. దానికి తాజా ఉదాహరణే.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు!
“మతతత్వ రాజకీయాలకు కేరళలో చోటు లేదు.. బీజేపీ ఇక్కడ ఎప్పటికీ గెలవలేదు..” అని విశ్లేషకులు, అక్కడి రాజకీయ నేతలు బల్లగుద్ది చెప్పే మాటలు ఇవి. కేరళ, తమిళనాడు లాంటి చోట్ల ప్రాంతీయ భావాలు ఎక్కువని, జాతీయ పార్టీ అయిన బీజేపీకి స్పేస్ ఉండదని అంతా అనుకునేవారు. కానీ, స్థానిక సంస్థల ఫలితాలు ఈ అంచనాలను తలకిందులు చేశాయి.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంగతి పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో బీజేపీ ఎంత బలంగా వేళ్లూనుకుందో ఈ ఫలితాలు రుజువు చేశాయి. కేరళ రాజధాని తిరువనంతపురం ఇప్పుడు కాషాయం రంగు పులుముకుంది. దాదాపు 45 ఏళ్ల వామపక్ష ఆధిపత్యానికి గండి కొడుతూ, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం చిన్న విషయం కాదు. కేవలం రాజధానిలోనే కాదు.. పాలక్కాడ్, కోజికోడ్, త్రిశూర్ వంటి కీలక ప్రాంతాల్లోనూ కమలం పార్టీ దూసుకుపోయింది. 900 గ్రామపంచాయతీలు, 87 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటి, చరిత్రను తిరగరాసింది.
ఈ ఫలితాలను నిశితంగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది.. కేరళ అర్బన్ ఓటర్ల ఆలోచనా విధానం మారుతోంది. విద్యావంతులు, పట్టణ వాసులు ఇప్పుడు ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కేవలం హిందూ ఓటర్లే కాదు, మైనార్టీలను ఆకర్షించడంలోనూ బీజేపీ సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండే త్రిశూర్ కార్పొరేషన్లో బీజేపీ తరఫున ముస్లిం అభ్యర్థి ముంతాజ్ విజయం సాధించడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. “బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం” అనే ముద్రను చెరిపేసుకోవడంలో ఆ పార్టీ సఫలమవుతోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు, అధికార వామపక్ష కూటమి (LDF) మీద ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. శబరిమల వివాదం, సంచలనం సృష్టించిన గోల్డ్ స్కామ్ వంటివి హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. సాధారణంగా ఎల్డీఎఫ్ మీద కోపం వస్తే జనం యూడీఎఫ్ వైపు వెళ్తారు. కానీ ఈసారి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది.
ప్రస్తుతానికి కేరళ నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ ఉన్నప్పటికీ, అసెంబ్లీలో బలమైన ప్రాతినిధ్యం కోసం ఆ పార్టీ ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ముఖ్యంగా మోదీ మార్క్ అభివృద్ధి నినాదంతో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఫలితాలే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అయితే.. బీజేపీ సులభంగా 15 నుంచి 20 సీట్లు గెలుచుకుని ‘కింగ్ మేకర్’గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే, ఇది అంత వీజీ కాదు. ఎందుకంటే కేరళ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ రెండు కూటములదే హవా. పల్లెల్లో కూడా బీజేపీ చొచ్చుకుపోతేనే అధికారం దిశగా అడుగులు పడతాయి. ఏది ఏమైనా.. లోకల్ బాడీ రిజల్ట్స్ అధికార పక్షానికి ఒక వేకప్ కాల్ లాంటివి. “బీజేపీ గెలుపు ఆందోళన కలిగిస్తోంది” అని స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారంటే, కమలం పార్టీ ఏ రేంజ్లో షాక్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బీహార్ విజయంతో జోష్ మీద ఉన్న బీజేపీ.. ఇప్పుడు బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళను కూడా సీరియస్ టార్గెట్‌గా పెట్టుకుంది.
ఫలితాలు రాగానే ప్రధాని మోదీ “థ్యాంక్యూ తిరువనంతపురం” అని ట్వీట్ చేశారు. మరి కొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అది “థ్యాంక్యూ కేరళ”గా మారుతుందా? లేదా ఎప్పటిలాగే ఆ రెండు కూటములే రాజ్యమేలుతాయా? అన్నది చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం.. కేరళ పాలిటిక్స్‌లో ఇప్పుడు ‘థర్డ్ ప్లేయర్’ గేమ్ మొదలుపెట్టేశాడు!






