బీజేపీ త్రిశూల్ వ్యూహం
2024లో భారీ మెజార్టీతో అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో ఉన్న బీజేపీ.. పూర్తిగా హిందూవాదాన్ని తలకెత్తుకుంది. అయోధ్యలో రాములోరి ఆలయం నిర్మాణం చేపట్టి..5 శతాబ్దాల హిందువుల కలను నెరవేర్చింది. భక్తుల నుంచి బాల రాముడు పూజలను అందుకుంటున్నారు. దీంతో హిందువుల్లో అధికశాతం జనం మద్దతు సంపాదించినట్లైంది. అయోధ్య రామాలయం పూర్తయింది. ఇప్పుడు తర్వాతగా మథురలో శ్రీ కృష్ణుడి ఆలయ నిర్మాణం అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇదే అంశంపై ఇటీవల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర అని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ ఆలయం ఉంది. జ్ఞానవాపి మసీదు కూడా ఉంది. మసీద్, మందిర్కు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మందిరం వద్ద పూజలు చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. శ్రీకృష్ణుడి జన్మస్థానం అయిన మథురలో సామరస్యంగా, చట్టపరంగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతాయని దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్ప్రదేశ్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని స్వాగతించిన ఆయన.. ఇక గుజరాత్లోని మథురలో వివాదంలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి అంశం బీజేపీ ప్రాధాన్యత జాబితాలో తర్వాతి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. అయోధ్యలో వేడుకలను చూసిన నంది బాబా.. మొండిగా రాత్రికి రాత్రే బారికేడ్లను తెరిచాడని.. ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని నేలమాళిగలో హిందూ దేవతలకు పూజలు ప్రారంభించడాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నంది శివుడి వాహనం కాగా.. జ్ఞానవాపిలో శివలింగానికి పూజలు జరుగుతున్నాయని యోగి తెలిపారు. ఇక ఇప్పుడు మన కృష్ణుడు మొండిగా ఉన్నాడని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదం గురించి యూపీ అసెంబ్లీలో ఆదిత్యనాథ్ ప్రస్తావించారు.
అయితే కృష్ణుడి గురించి ఆదిత్యనాథ్ స్పందించడం.. శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన కేసుకు స్పష్టమైన సూచనగా అర్థం అవుతోంది. గుజరాత్లోని మథురలో 17 వ శతాబ్దంలో నిర్మించిన షాహీ ఈద్గా అనే మసీదును గతంలో శ్రీకృష్ణుడి జన్మ స్థలంలో ఉందని హిందూ పిటిషనర్లు పేర్కొనగా.. ఆ ప్రాంతంలో సర్వే చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇటీవలె ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అనుమతులు ఇచ్చింది. అయితే అయోధ్య తర్వాత వారణాసి, మథుర అంశాలు బీజేపీ ఎజెండాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయని తాజాగా యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. ఇక వారణాసి, మథురలను హిందువులకు అప్పగిస్తే.. మసీదు-మందిరం వివాదాలకు ముగింపు అవుతుందని.. అయోధ్య ఆలయ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ చెప్పిన కొన్నిరోజులకే యోగి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.













