దక్షిణ భారతాన మతరాజకీయాలు ఫలిస్తాయా..?

మతం, కులం, రాజకీయం, అవిభక్త కవలలు లాంటివి. అందుకే రాజకీయాల్లో మతానికి, కులానికి అంతప్రాధాన్యముంటుంది.అంతేకాదు…పార్టీలు సైతం మతం, కులం చూసే టికెట్లు కేటాయించడం, ఓట్లడగడం చేస్తాయి. అందుకే బీజేపీ 1990 నుంచి మత రాజకీయాలతో ప్రస్థానం సాగిస్తూ వస్తోంది. నాడు ఎల్ కే అద్వానీ.. రామజన్మభూమి రథయాత్రతో … బీజేపీకి ఊపు తెచ్చారు. అయితే ఆక్రమంలో పదుల సంఖ్యలో కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆపరిణామం బీజేపీ గ్రాఫ్ పెంచింది. అందుకే బీజేపీ ఎప్పుడూ మత రాజకీయాలకు అధికప్రాధాన్యమిస్తుంది.
అయోధ్య రామాలయం..
పక్కా ప్లానింగ్ తో ఎన్నికలకు ముందు శ్రీరాముడి భవ్య,దివ్య ఆలయాన్ని నిర్మించి… ప్రచారంలో గట్టిగానే వినియోగించుకున్నారు. ఎక్కడికెళ్లినా జై శ్రీరామ్ అంటూ నినదించారు. దీంతో చాలా వరకూ హిందూ ఓట్లు బీజేపీకి పోలరైజ్ అయ్యాయి. అయితే ఉత్తరాదిన ఇప్పటికే గట్టిగా పీఠాన్ని పదిలం చేసుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిపైనా ఫోకస్ పెంచింది. అందుకే ఏపీలో ఆలయాల విధ్వంసం కానీయండి.. తమిళనాడులో పెరియార్ భావజాలంపై విమర్శలు కురిపిస్తోంది. అయితే లేటెస్టుగా పూరి జగన్నాథుడి ఆలయ బాండాగారం తాళాలు పోయాయంటూ ప్రచారంలో ప్రస్తావించారు మోడీ. అవి తమిళనాడుకు చేరి ఉంటాయని వివాదాస్పద కామెంట్స్ సైతం చేశారు.
మత రాజకీయాల ప్రభావం..
ఉత్తరాదిన హిందూమతానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే అక్కడ మఠాధిపతులు, పీఠాధిపతుల ప్రాబల్యం ఎక్కువ. వారు చాలా వరకూ ప్రజల్ని తమ ప్రవచనాలతో ప్రభావితం చేస్తారు. అందుకే యూపీ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్ ను ఎంపిక చేశారు. ఆయన మఠానికి దాదాపు 12 పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని ప్రభావితం చేసే స్థాయి ఉందన్నది స్థానిక ప్రజలు, నేతల విశ్వాసం. అదే చిట్కా కర్నాటకలోనూ కొంతవరకూ ఉపయోగించారు. కొన్నిసార్లు ఫలించగా… మరికొన్ని సార్లు వికటించింది. అయితే కర్నాటకలోనూ మఠాదిపతుల ప్రాబల్యం ఉండడంతో అది సాధ్యమైందని చెప్పొచ్చు.
దక్షిణాదిన ఎలా…?
అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లో మాత్రం మతాన్ని ఓ ఆచారంగా మాత్రమే చూస్తారు. మఠాధిపతులను గౌరవిస్తారు. తప్ప, వారి చెప్పినవారికి ఓటేయడం పెద్దగా జరగదు. అందుకే మఠాలు, మఠాధిపతులు .. అంతగా ప్రజల్ని ప్రభావితం చేయలేకపోతున్నారు. అదీ కాకుండా… ఆలయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలన్న భావన ఇక్కడి ప్రజల్లో ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా దేవుళ్లపైనా సైతం చర్చించే విశాల దృక్పథం కావొచ్చు.. భావ స్వేచ్ఛ పేరుతో నోరు పారేసుకోవడం కావొచ్చు.. ఏదైానా సరే…ఈ రాష్ట్రాల్లో స్వేచ్ఛా వాతావరణం ఉందని చెప్పక తప్పదు.. కొన్ని రాష్ట్రాలు సహించని భావజాలాన్ని సైతం ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ దక్షిణాదిన మతరాజకీయం ఎలా ఫలిస్తుందో బీజేపీ నేతలకైనా అర్థమవుతుందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.