మహా ‘కమలం’ కల్లోలం..
మహారాష్ట్రలో పవర్ వేట కొనసాగుతోంది. పదవుల కోసం ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ఈ పరిణామాలు బీజేపీకి అనుకూలంగా ఉండడంతో.. ఆపార్టీ అగ్రనేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కానీ వరుస చేరికలతో .. మహారాష్ట్రలోని బీజేపీ ఎమ్మెల్యేలకు నిస్తేజం ఆవహిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, తమ ముందే మంత్రులుగా మారడం.. బీజేపీ ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదు. దీంతో మింగలేక, కక్కలేక అన్నట్లుగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల పరిస్థితి తయారైంది.
దీనికి సంబంధించి కేంద్ర రవాణశాఖ మంత్రి గడ్కరీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘మంత్రివర్గం నిండిపోయింది. ఆశావహులంతా విషాదంలో ఉన్నారు. పదవి వస్తుందన్న ఆలోచనతో ఇప్పటికే కుట్టించుకున్న దుస్తులను ఏం చేయాలో వారికి తెలియడం లేదు’’ అని తెలిపారు. దీనర్థం బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉండి పదవులకోసం రేసులో ఉన్న అభ్యర్థుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని పరోక్షంగా ప్రస్తావించారు. వారి పరిస్థితిని ఇంతకన్నా ఎవరూ చక్కగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపుతు తిరుగుతున్న వేళ.. బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను పంకజా ముండే ఖండించారు. అజిత్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరడంపై చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, భయం వల్ల వారు దీని గురించి మాట్లాడటం లేదన్నారు.
నాలుగైదు సార్లు ఎన్నికల్లో గెల్చి, పదవి దక్కుతుందని ఆశిస్తున్న సమయంలో … వేరే పార్టీ నేతలు వచ్చి పదవులు తన్నుకుపోతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు వాపోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనైనా మంత్రిపదవి దక్కితే…. అనుచరులకైనా సర్థిచెప్పుకునే పరిస్థితి ఉండేదంటున్నారు. దీంతో ఇతర పార్టీల్లో గెల్చి ప్రభుత్వంలో చేరిన వారికే రోజులు బాగున్నాయంటూ నిట్టూరుస్తున్నారు. ఈపరిణామాలు చూస్తుంటే.. భవిష్యత్తులో రాజకీయంగా బీజేపీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.













