కర్నాటకం…
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రజరుగుతోందా? దీనికి సింగపూర్ వేదికగా రాజకీయాలు జరుగుతున్నాయా? కర్నాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారి కలకలం రేపింది. సింగపూర్‌లో జరుగుతున్న కుట్రా రాజకీయాల గురించి సన్నిహితుల ద్వారా తెలుస్తోందన్నారు. బెంగళూరులో ఏ విధమైన ప్రక్రియ జరిగినా వెంటనే సమాచారం తెలిసిపోతుందని… విదేశాల్లో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్య పరీక్షల కోసం జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన నేపథ్యంలోనే డీకే శివకుమార్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కుట్రలకు బెదిరేది లేదన్నారు.
అదేసమయంలో సీఎంను చేయడం, కూల్చడం కూడా తెలుసన్న సీనియర్ నేత బికె హరిప్రసాద్ వ్యాఖ్యలు.. పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. బికె వ్యాఖ్యల తీవ్రతను తగ్గించేందుకు డికె శివకుమార్ సహా మంత్రులు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో అందరూ సమానమని, ఏ కులాన్ని తక్కువ చేసే ప్రక్రియ కాంగ్రెస్ నుంచి జరగదన్నారు డికె శివకుమార్. ఏఐసీసీ కార్యదర్శిగా రెండు దశాబ్దాలుగా కొనసాగిన బీకే హరిప్రసాద్ వ్యాఖ్యలు కర్ణాటకకు సంబంధించినవి కావన్నారు మంత్రి లింగారెడ్డి. కాగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మైసూరులో మాట్లాడుతూ బీకే హరిప్రసాద్ సీనియర్ నేత అని, పార్టీ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయరన్నారు.
మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లు ఏకమవుతాయన్న వార్తలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేసినా, చేయకపోయినా 15 నుంచి 20 సీట్లలో గెలుపు కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్యక్తంచేశారు. పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పోరాడి, అసెంబ్లీ ఫలితాలను పునరావృతం చేస్తామన్నారు. ఆరెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న సమచారముందన్న సిద్ధరామయ్య…వాళ్లు ఐక్యంగా పోటీ చేసినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే .. జేడీఎస్ మాత్రం మైండ్ గేమ్ ఆడుతోందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించారు. దీంతో పొత్తు ఖాయమేనంటూ గత కొంత కాలంగా వచ్చిన వార్తలకు ఆయన ప్రకటన బలం చేకూర్చినట్టయింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు వచ్చినా సరే ఒంటరిగానే బరిలో దిగుతామని తేల్చి చెప్పారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకొని భారీ విజయం సాధించగా.. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి.













