కత్తి మీద సాము..చెయ్యాల్సిందేనా సోము?
మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణకు భాజాపా అధిష్టానం ఉద్వాసన చెప్పింది. అతడ్ని ఆంధ్రప్రదేశ్ భాజాపా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఆ స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరగనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భాజాపా అధ్యక్షపదవి సోము వీర్రాజుకు కత్తి మీద సాము లాంటిదేనని అంటున్నారు.
చంద్రబాబుకు షాక్…
నిజానికి ఒక పార్టీ అధ్యక్షపదవిలో మార్పు చేర్పులతో మరో పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ విచిత్రంగా కన్నాఉద్వాసన పట్ల ఆంధ్రప్రదేశ్లోని అధికార, విపక్ష పార్టీల అభిమానులు ఒక్కసారిగా స్పందించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఇది చంద్రబాబుకు షాక్ అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ఆంధ్రలో పార్టీ ఓడిపోగానే తన బినామీలైన సుజనా, సిఎం రమేష్ తదితరులను భాజాపాలోకి పంపడం ద్వారా ఆ పార్టీకి బాబు తన స్నేహహస్తాన్ని అందించారని, అనంతరం కన్నా రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన పూర్తిగా తేదేపా బాటలోనే నడిచేలా బాబు జాగ్రత్త పడ్డారని వైసీపీ అంటోంది. ప్రభుత్వం మీద తేదేపా చేసిన విమర్శలే తానూ చేయడం దగ్గర్నుంచి 3 రాజధానులపై గవర్నర్కు లేఖ రాయడం దాకా అంతా బాబు కనుసన్నల్లోనే కన్నా నడిచేవారని, అలాంటి కన్నాను తొలగించడంతో బాబుకు షాక్ తగిలిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇదంతా ఒట్టిదేనని తేదేపా కొట్టి పారేస్తోంది. భాజాపా అంతర్గత వ్యవహారంతో తమకేం సంబంధం అంటూ తీసిపారేస్తోంది.
కత్తిమీద సోము…
ఇదిలా ఉంటే తాజాగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు భాజాపాలో ఉండే నాయకులు అందరిలోకి చంద్రబాబుకు బద్ధ విరోధి అనే చెప్పాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సోము వీర్రాజు తేదేపాని విపరీతంగా విమర్శించేవారు. మంచి వాగ్థాటి కలిగిన సోము వీర్రాజు వైసీపీ విషయంలో ఆది నుంచీ కాస్త మెతకవైఖరే అవలంభించారని చెప్పాలి. అధికార పార్టీ మారిన తర్వాత కూడా ఆయన వైసీపీ కన్నా తెదేపానే ఎక్కువగా తిట్టిపోయడం, ఆరోపణలు గుప్పించడం గమనార్హం. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించాలని తహతహలాడుతున్న భాజాపా అందుకు తొలి అడ్డంకిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పతనాన్ని కోరుకుంటోంది. ఆ తర్వాత వైసీపీపై కత్తులు దూయాలని భావిస్తోంది. అందుకే తేదేపా నుంచి తమ పార్టీలోకి వలసల్ని కోరుకుంటోంది. అయితే ఈ లక్ష్యాలను సోము వీర్రాజు ఎంత వరకూ నెరవేరుస్తారనేది సందేహాస్పదమే. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం కంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేది మరింత నష్టదాయకం అనేది నిర్వివాదం. మరి సోము వీర్రాజు తన వైసీపీ అనుకూల వైఖరిని ఒక్కసారిగా మార్చుకోగలరా అనేది ప్రశ్న. అంతే కాకుండా తేదేపా నాయకుల్ని పార్టీలోకి ఆకర్షించడం కూడా సోము వీర్రాజు నాయకత్వానికి పరీక్షే. వీటన్నింటినీ అధిగమించి సోము భాజాపా అధిష్టానం ఆశిస్తున్న లక్ష్యాలను ఎలా చేరుకుంటారనేది చూడాల్సి ఉంది.













