ట్రంప్ ‘వివేకం’..
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం రేసు ఆసక్తికరంగా సాగుతోంది. తొలిస్థానంలో ట్రంప్ ఉండగా తర్వాతి స్థానానికి వివేక్ రామస్వామి చేరుకుంటున్నారు. తొలి టీవీ డిబేట్ లో ఆయన వాదనకు .. రిపబ్లికన్ ఎంపీలు, ప్రజలు సైతం ముగ్ధులయ్యారు. దీంతో రామస్వామి తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. అంతేనా ఈ 21వ శతాబ్దంలో అత్యుత్తమ అధ్యక్షుడిగా ట్రంప్ అని ఉద్ఘాటించారు. దీంతో వివేక్ రామస్వామి.. ఫస్ట్ డిబేట్ లో గెలిచేశారని ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇంతకూ వివేక్ రామస్వామి ట్రంప్ గురించి ఎందుకు ప్రస్తావించారంటే.. ట్రంప్ కు ఇప్పుడు అత్యధిక శాతం ఎంపీలు, జనం నుంచి కూడా మెజార్టీ ఉంది. ఎంపీల్లో ఎక్కువమంది ట్రంప్ వెంటే ఉన్నారు. అందుకు ట్రంప్ మగ్ షాట్ కు వచ్చిన ఆదరణే నిదర్శనం. ట్రంప్ పై కాసుల వర్షం కురుస్తోంది. ఈపరిస్థితుల్లో ట్రంప్ కోర్టు చిక్కులను దాటి బయటకు రాగలిగితే.. ట్రంప్ కు పార్టీలో తిరుగుండదు. దీంతో ట్రంప్ అధ్యక్షుడైతే, వైస్ ప్రెసిడెంట్ గా తాను ఉండేందుకు కూడా రామస్వామి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే తనను రామస్వామి గట్టిగా సమర్థించారో.. అప్పుడే ట్రంప్ కూడా ఆయనను తన పార్టీ గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ గా చేసేందుకు ప్రయత్నిస్తారన్న ప్రచారం మొదలైపోయింది.
ఓవేళ ట్రంప్ కాని పోటీ చేయలేని పరిస్థితి వస్తే.. అప్పుడు ట్రంప్ మద్దతు తనకు దక్కేలా రామస్వామి ప్లాన్ కూడా చేసి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తన ఎన్నిక మరింత సులభం అవుతుందన్నది ఈ వ్యాపార వేత్త ఆలోచనగా కనిపిస్తోంది. అప్పుడు బైడన్ పై పోటీ చేసి గెలిచేయొచ్చన్నది రామస్వామి ప్లాన్ గా ఆ పార్టీ నాయకులే భావిస్తున్నారు. ఏదైనా వన్ షాట్ ఎట్ టూ బర్డ్స్ కొట్టారు రామస్వామి అని చెప్పక తప్పదు.
అయితే ఎన్నికల ప్రచారంలో తనకు సోషల్ మీడియా సపోర్టు కూాడా కావాల్సి ఉందన్నది రామస్వామికి తెలుసు. అందుకే ఎలన్ మస్క్ ను దువ్వుతున్నారు. తాను అధ్యక్షుడైతే తన సలహాదారుగా ఎలన్ మస్క్ ను నియమిస్తానని రామస్వామి ఇప్పటికే ఓ సందర్భంలో తెలిపారు. అంటే..ముందస్తుగా తనకు సరైన ప్రచారం ఉండేలా చేసేందుకు మస్క్ కు గాలం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఎటువైపు చూసినా..తనకు లబ్ధి చేకూరేలా రామస్వామి పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. ఎలా చూసినా, తనకు పదవి దక్కేలా పక్కాగా రామస్వామి ప్లాన్ చేశారని అనుచరులు భావిస్తున్నారు.






