Joe biden: దిగిపోయే ముందు బైడెన్ జాగ్రత్తలు.. కొడుకును ఒడ్డున పడేసిన అమెరికా ప్రెసిడెంట్..
అమెరికా అధ్యక్షుడు బైడెన్(Joe biden) ముందు చూపు ప్రదర్శించారు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేముందు బుర్రకు పదునుపెట్టారు. తనకొడుకు హంటర్ బైడెన్(Hunter biden) ను కేసుల నుంచి బయట పడేశారు. చివరిగా తనకున్న అధికారాన్ని ఇందుకు వాడేశారు బైడెన్. తనకొడుకు హంటర్ పై ఉన్న కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఈ సందర్భంగా జో బైడెన్ ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు భారీ ఊరట లభించింది. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న జో బైడెన్.. తన కుమారుడికి కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ (Joe Biden pardons son Hunter) సంచలన నిర్ణయం తీసుకున్నారు. "నేను అమెరికన్ ప్రజలకు నిజం చెప్పాలి – ఇది నా జీవితమంతా నేను అనుసరించిన సూత్రం. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో నేను జోక్యం చేసుకోనని అధ్యక్షుడైన తొలిరోజే చెప్పాను. నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. నా కుమారుడు హంటర్ బైడెన్ ను అన్యాయంగా విచారించినప్పుడు నేను కూడా చూశాను.
రాజకీయ కుట్రలో భాగంగానే ఆయనపై కేసులు పెట్టారు. జరిగింది చాలు… ఈ కేసుల్లో ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నాను. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అయితే.. హంటర్ దోషిగా తేలిన సమయంలో తాను క్షమాభిక్ష కోరబోనని జో బైడెన్ స్పష్టం చేశారు. అయితే జో బైడెన్ తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
హంటర్ పై ఉన్న కేసులు..(hunter cases)
2018లో తుపాకీ కొనుగోలు సమయంలో ఆయుధ వ్యాపారికి ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి అలవాటు పడలేదని, తన వద్ద ఎలాంటి అక్రమ ఆయుధాలు లేవని చెప్పారు. కానీ అది తప్పని తేలింది. హంటర్ అప్పటికే అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేశారు.. వాటికి బానిసగా మారాడు.. 11 రోజుల పాటు అక్రమంగా ఆయుధాలు ధరించారు. కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో హంటర్ ను ఈ ఏడాది జూన్ లో కోర్టు దోషిగా తేల్చింది. అయితే ఇంతవరకు శిక్ష ఖరారు కాలేదు. దీనిపై జో బైడెన్ స్పందించారు. ఈ తీర్పును తాను అంగీకరిస్తున్నానని చెప్పారు. ఈ కేసులో తన కుమారుడి తరఫున క్షమాభిక్ష కోరబోనని ఆయన చెప్పారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలగి సమయంలో తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని బైడెన్ సద్వినియోగం చేసుకున్నారు.






