దౌత్యానికి పరీక్ష
అగ్రరాజ్యం అమెరికా దౌత్యం వికటిస్తోందా? ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతిస్తూనే.. అరబ్ దేశాలతో చర్చించాలన్న అమెరికా ప్రయత్నాలు ఆదిలోనే ఫెయిలయ్యాయా? ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన బైడెన్‌తో తాము భేటీ అయ్యేది లేదని .. జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా దేశాలు స్పష్టం చేశాయి. అంతే కాదు.. గాజా యుద్ధాన్ని ఆపే లక్ష్యంతో జోర్డాన్ నిర్వహించాల్సిన సదస్సు సైతం రద్దైంది. ఇదే విషయాన్ని జోర్డాన్.. అమెరికాకు వివరించినట్లు సమాచారం.
మంగళవారం అర్ధరాత్రి గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో వందలాది మంది రోగులు చనిపోవడంతో.. జోర్డాన్‌లో ఆందోళనలు మిన్నంటాయి. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే తమ ఉనికికే ముప్పు వస్తుందని భావించిన జోర్డాన్ రాజు అబ్దుల్లా ఈ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ సమాచారాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మన్ సఫాది కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టర్కీలోని నాటో కార్యాలయం దగ్గర కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గాజాకు సాయం అందించాలని ప్రజలు టర్కీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికే అరబ్ దేశాలు.. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈదశలో అమెరికా చేస్తున్న రాయభారాన్ని ఆయాదేశాలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికా మాత్రం..
తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గాజాకు వంద మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. ఇది ఇళ్లు, వాకిలీ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న వారికి.. ఇది సాయంగా పనికి వస్తుందని అమెరికా చెబుతోంది.
మరోవైపు.. గాజా వాసులకు సాయమందించాలంటూ అరబ్ దేశాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికే హిజ్బుల్లా వార్నింగులున్నాయి. ఇజ్రాయెల్ పై అరబ్ దేశాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఈ పరిస్థితుల్లో బైడెన్ సూచించినట్లు అంగీకరించడానికి అరబ్ దేశాలు సిద్ధంగా లేవు.ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని మరింత రగిల్చే ప్రయత్నాలకు దూరంగా ఉంటే మంచిదని భావిస్తున్నాయి.













