భారత రాజకీయాల్లో ‘జోడో’ సునామీ…?
వరుస పరాజయాలతో పోరాటపటిమ నశించి, పూర్తిగా పతనమవుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్న సమయంలో .. ఆ శతాధిక పార్టీకి ఊపిరిలూదింది రాహుల్ భారత్ జోడో యాత్ర. 2022సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన మొదటి జోడో యాత్ర 4,080 కిలోమీటర్లు సాగింది. జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో ఈ ఏడాది జనవరిలో ముగిసింది. 12 రాష్ట్రాలు, 75 జిల్లాల గుండా 126 రోజులు సాగింది. దేశంలో అతిపెద్ద పాదయాత్రగా చరిత్రకెక్కింది.
భారత జోడో యాత్ర-1 మొదలుపెట్టినప్పుడు ఎవరిలోనూ ఏఆశ లేదు. అంతా అయిపోయింది మోడీ చరిష్మా ముందు.. మనపార్టీ నిలబడలేకపోతోంది. ఇక ఎలాగో.. ఏమిటో అనుకుంటూ చాలా మంది సీనియర్లు జంపై పోయారు. మరికొందరు గ్రూప్-24 పేరుతో అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఇక మీపనైపోయింది. అధ్యక్షపదవి వేరొకరికి ఇవ్వాల్సిందే అన్నారు. మరికొందరు అధికార పార్టీ బీజేపీతో అంటకాగారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ యాత్ర ప్రారంభించారు. వివిధ వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగారు. ప్రజాసమస్యలను ఆకలింపు చేసుకుంటూ యాత్ర చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫలితాలు హస్తానికి ఊపిరిలూదాయి. ఇంకేముంది నెమ్మదిగా కాలు, చేయి కూడదీసుకుని పార్టీ రేసులోకి వచ్చింది. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే.. మోడీ సర్కార్ ను ఎన్నికల్లో గద్దెదించుతామన్నంత విశ్వాసాన్ని పార్టీనేతల్లో నింపింది.
ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం రాహుల్, ప్రియాంక విపరీతంగా శ్రమిస్తున్నారు. ఏ రాష్ట్రంలో పార్టీనేతలు రమ్మన్నా… ప్రచారానికి రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ .. పార్టీ నేతలకు ఫేవరెట్ అయ్యారు. మీరు వచ్చి ప్రచారం చేయండి గెలిచేస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రాజకీయాల్లో కురువృద్ధుడు లాంటి ఖర్గేను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో ఆయన పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. చిన్నచిన్న సమస్యలు వచ్చినా ఆయన వాటిని తనదైన శైలిలో పరిష్కరిస్తున్నారు. దీంతో రాహుల్ కు… ప్రచారానికి మరింతగా సమయం దక్కుతోంది.
తమ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సత్ఫలితాలిచ్చిందని.. దానికి కొనసాగింపుగా ‘భారత్ జోడో యాత్ర 2.0’ నిర్వహణపై కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు డిసెంబరు-ఫిబ్రవరి నడుమ చేపడితే రాజకీయ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తిగా పాదయాత్రగా కాకుండా హైబ్రిడ్ మోడల్లో అంటే.. నడకతో పాటు వాహనాల ద్వారా కూడా యాత్ర చేపడితే ఎలా ఉంటుందని కూడా తర్జనభర్జన పడుతోంది. నిరుడు కేంద్రంలోని పాలక బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని.. దీనికి ప్రతిగా దేశాన్ని ఒక్కటి చేయడం అనేది తొలి యాత్ర ఉద్దేశం. మలి యాత్రకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సెప్టెంబర్‌లో వెల్లడించారు. ఇప్పటికే దక్షిణం నుంచి ఉత్తరానికి యాత్ర చేశారని.. ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పు వైపు రెండో జోడో యాత్ర చేపట్టాలని రాహుల్‌ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సైతం కోరారు.













