అన్నదాతల అలుపెరుగని పోరు..! రేపే భారత్ బంద్..!!
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు చేస్తున్న పోరు కొనసాగుతూనే ఉంది. చట్టాలను ఉపసంహరించుకునేందుకు ఓ వైపు కేంద్రం ససేమిరా అంటోంది. మరోవైపు రైతన్నలు కూడా తాము ఉద్యమాన్ని విరమించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. అందులో భాగంగా రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. పలు కార్మిక సంఘాలతో పాటు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ బంద్ కు మద్దతునిస్తున్నాయి.
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో పలు ధపాలు చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు విఫలమయ్యాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనేదే తమ ఏకైక డిమాండ్ అని రైతులు స్పష్టం చేస్తున్నారు. అందుకోసం అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి మార్చి 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అంతేకాక.. 28న హోలీ పండుగ రోజు వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేసి రైతు సంఘాలు నిరసన తెలపనున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో గతేడాది డిసెంబర్లో రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. తాజా బంద్‌తో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి.
రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. ఇప్పటికే బంద్‌కు అన్ని ట్రేడ్, టాన్స్‌పోర్ట్ యూనియన్లు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. రేపటితో రైతుల ఉద్యమానికి నాలుగు నెలలు. ఏడాదిన్నర పాటు తాత్కాలికంగా ఆ చట్టాలను పక్కన పెడుతామని కేంద్రం ప్రతిపాదించినప్పటికీ రైతులు అందుకు అంగీకరించ లేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక ఎజెండాతో తమ పోరాటం కొనసాగిస్తున్నారు.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని సింగు, టిక్రి, ఘాజీపూర్ ప్రాంతాల్లో నాలుగు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి డిమాండ్లను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో రైతులకు పోరుబాట తప్పట్లేదు. ప్రస్తుత బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆర్టీసీ బస్సులను నడపబోమని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, కేరళ ప్రభుత్వాలు కూడా బంద్ కు తాము సహకరిస్తామని చెప్పాయి.













