‘అటల్’ సేతు ఎక్కడుంది?
దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని అటల్ సేతుగా వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. మొత్తం పొడవు దాదాపు 22 కి.మీలు కాగా.. 16 కి.మీలకుపైగా అరేబియా సముద్రంపై ఉంటుంది.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రాయానికి త్వరిత కనెక్టివిటీని అందిస్తుంది. ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం మధ్య ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుంది. అటల్ సేతుపై ప్రయాణం చేస్తే 20 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. అంతేకాదు నిరంతరం ట్రాఫిక్ జామ్ ల నుండి ఉపశమనం కలగనుంది. ఈ వంతెనపై 100 కి.మీ. వేగంతో ప్రయాణం చేయవచ్చు.ముంబై నుంచి పుణె, గోవాతో పాటు దక్షిణ భారత దేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ముంబై పోర్టు, జవహర్ లాల్ పోర్టు మధ్య కనెక్టివిటిని మెరుగుపరుస్తుందని అధికారులు తెలిపారు.
అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇవి భద్రత పరంగా ఎంతో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి.
శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒకవైపు సౌండ్ బారియర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు.
ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది ఈ వంతెన వీడియో, ఫొటోలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ‘‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్‌కు సంబంధించి రాత్రిపూట తీసిన వీడియో ఇది. నిపుణులైన ఇంజినీరింగ్ బృందం కష్టానికి, నిబద్ధతకు నిదర్శనం. దీని నిర్మాణంతో అనుసంధానం, వాణిజ్యం మెరుగుపడనున్నాయి. ఈ గోల్డెన్ రిబ్బన్‌పై ప్రయాణించేందుకు వేచి చూస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.













