ఆప్ లో అంతర్గత నియంతృత్వం..?

సామాన్యుడి ఘోష నుంచి పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందంటే.. నాడు అన్నాహజారేతో కలిసి పోరాటాలు చేసిన వారిలో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఒకరు. తర్వాత తన ఉద్యమాన్ని పతాకస్థాయికి తెచ్చి, నెమ్మదిగా ఆప్ గా నామకరణం చేశారు. అంతేకాదు.. ఆప్ లో ఉన్నవారిలో ఎక్కువమంది ప్రజాసమస్యలపై నేతలను నిలదీసినవారే. అలాంటివారిని పిలిచి పార్టీలో చోటిచ్చారు. ఆప్ అధికారంలోకి రావడంతో వారికి ప్రజాప్రతినిధులుగా సముచిత స్థానం సైతం లభించింది. అయితే ఆతర్వాత ఆప్ నుంచి…ప్రశాంత్ కుమార్, యోగేంద్రయాదవ్ లాంటి వారు తమతమ కారణాలతో బయటకు వెళ్లిపోయారు. వీరి పార్టీ ఎదుగుదలలో కీలకభూమిక పోషించారు. అలాంటి వారు సైతం పార్టీని వదిలి వెళ్లినప్పుడు చాలా ఆరోపణలు వినిపించాయి.
అయితే ఇప్పుడు ఆప్ ను చూస్తే వ్యక్తిపూజకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. అధినేత కేజ్రీవాల్ చెప్పిందే వేదం. కాదంటే ఇక పార్టీలో ఉండరంతే.. ఆయన అరెస్టైనా కూడా పార్టీలో ఇంకొకరు…సీఎం పదవివైపు చూడడం లేదంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మోడీని ఢీకొట్టి మూడుసార్లు ఢిల్లీ పీఠం అధిష్టించిన యోధుడిగా ఆప్ కేడర్ లోనూ కేజ్రీవాల్ పై అభిమానం ఉంది. దీంతో వారెక్కడ తమను వదిలేస్తారో అన్న భయం సైతం ఆప్ నేతల్లో వ్యక్తమవుతుందంటారు. అందుకే ఆప్ నేతలు కేజ్రీవాల్ మాట జవదాటేందుకు భయపడతారన్న పరిస్థితి ఉంది.
అయితే ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ దాడి తర్వాత .. ఆప్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంతన్నది బయటకు వస్తోంది. సాక్షాత్తూ సీఎం నివాసంలో .. కేజ్రీవాల్ కోసం ఎదురుచూస్తున్న ఎంపీని.. అందులోనూ మహిళా ఎంపీని అంత దారుణంగా కొట్టడం అంటే.. పరిస్థితి అర్థమవుతోంది. అందులోనూ కొట్టిందెవరయ్యా అంటే సీఎం సహాయకుడు. అందుకే దాడి జరిగిన రెండు రోజులవరకూ ఏ ఆప్ నేత మాట్లాడలేదు. కనీసం స్పందించలేదు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో తప్పనిసరిగా బిభవ్ చేసింది తప్పే, చర్యలు తీసుకుంటామని ముక్తసరిగా స్పందించారన్న ఆరోపణలున్నాయి.
అంటే వ్యక్తులు, సమాజంపై మక్కువతో ఏర్పడి న పార్టీ కాస్తా.. ఇప్పుడు పూర్తిస్థాయి నియంతృత్వాన్ని చవిచూస్తోంది. నాడు తమతో నడిచిన చాలా మంది నేతలు ఇప్పుడు వేర్వేరు పార్టీలోకి చేరిపోయారు. అయినా కేజ్రీవాల్ అదృష్టమో, పాలనా చాతుర్యమో.. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లో నాటుకుపోయింది. దీనికి తోడు ఏఎండకు ఆగొడుకు అన్నట్లుగా ఆర్ఎస్ఎస్ కు ఆగ్రహం కలిగించకుండా కేజ్రీవాల్ వ్యవహరిస్తారన్న అపప్రథ ఉంది. దీంతో ఎవరైతే ఏం.. హిందువులకు ఆప్తుడైతే చాలన్నట్లు సంఘ్ కూడా ఆలోచిస్తోందన్న ఊహాగానాలున్నాయి. దీనికి తోడు కేజ్రీవాల్ తర్వాత ఎవరంటే ఆయన భార్య సునీత పేరు తప్ప ఇంకొకరి పేరు వినపడడం లేదు. అంటే వారసత్వం కూడా వంటపట్టించుకుంటోంది ఆప్.