ఢిల్లీలో ఆపరేషన్ ‘ఝాడు’…

హస్తినలో ఆపరేషన్ ఝాడు ప్రారంభమైందా..? ఆప్ అంతానికి కమలదళం భారీ స్కెచ్చేసిందా..? అందులో భాగంగా ఆప్ ను అణచివేసే ప్రయత్నాలు ప్రారంభించిందా..? ఈ మంత్రాంగంలో భాగంగా ఆప్ నేతలను వివిధ కేసుల్లో వరుసగా అరెస్టులు చేస్తోందా..? ఢిల్లీలో ఆప్ కార్యాలయం ఎదురుగా జరిగిన నిరసనల్లో కేజ్రీవాల్ .. ఇదే ఆరోపణలు చేశారు. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలపై ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరిన సమయంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఆమ్‌ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. ఆప్ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆప్‌ను ముప్పుగా భావిస్తోన్న బీజేపీ నేతలు.. నాకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ ఝాడు పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆప్ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమే’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.
బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కేజ్రీవాల్ తన పార్టీ కార్యకర్తలతో సహా బయలుదేరారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్ కార్యాలయం ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బైఠాయించి నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు డీడీయూ మార్గ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.