బీజేపీకి నైతిక బలాన్నిస్తున్న జగన్, చంద్రబాబు..!!
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఢిల్లీలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆదివారం రోజంతా ఢిల్లీలో ప్రారంభోత్సవ హడావుడి ఉండనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం జరుగుతుంది. అయితే ఈ భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభిస్తుండడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అయినా బీజేపీ మాత్రం వెనకడుగు వేయకుండా ముందుకెళ్తోంది. విపక్షాల ఆరోపణలను పట్టించుకోకుండా రివర్స్ అటాక్ చేస్తోంది. అయితే అడగకుండానే మద్దతిచ్చే కొన్ని పార్టీలు ఇప్పుడు కూడా బీజేపీకి అండగా నిలుస్తున్నాయి.
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై రాజకీయం జోరుగా నడుస్తోంది. దీన్ని రాష్ట్రపతిచే ప్రారంభింపజేయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ప్రధాని మోదీయే ఈ భవనాన్ని ప్రారంభిస్తారని తేల్చి చెప్పింది. పార్లమెంట్ అంటే ప్రధాని కూడా భాగమేనని వాదిస్తోంది. చారిత్రక ఘట్టాన్ని బాయ్ కాట్ చేసి విపక్షాలు తప్పు చేస్తున్నాయని విమర్శిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. ప్రధాని కాకుండా రాష్ట్రపతిచే ప్రారంభింపజేయాలా ఆదేశాలివ్వాలని కోరాయి. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. దీంతో విపక్షాల ప్రయత్నాలు నెరవేరలేదు.
ఎన్డీఏలోని 18 పార్టీలతో పాటు మాయావతి, జగన్, చంద్రబాబు లాంటి పార్టీల నేతలు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. దీంతో విపక్షాలు లేకపోయినా ఈ పార్టీల మద్దతు బీజేపీకి నైతిక బలాన్నిస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలన్నీ ఒక క్లారిటీకి వచ్చేశాయి. కొన్ని పార్టీలు బీజేపీ వైపు, మరికొన్ని కాంగ్రెస్ వైపు వెళ్లక తప్పని పరిస్థితిలోకి వెళ్లాయి. దీంతో తమతో కలసివచ్చే వాళ్లెవరో అని బీజేపీ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో మాయవతి, జగన్, చంద్రబాబు.. తామున్నామంటూ మరోసారి భరోసా ఇచ్చారు.
వైసీపీ, టీడీపీ తమతో కలవవనే క్లారిటీ కాంగ్రెస్ సహా ఆ కూటమి పార్టీలకు వచ్చేసింది. అందుకే ఇటీవల పలు సమావేశాలకు ఆ రెండు పార్టీలకు ఆహ్వానం పంపలేదు. వైసీపీ ఎప్పటి నుంచో బీజేపీతో సఖ్యతగానే ఉంటోంది. కానీ టీడీపీ పరిస్థితి అలా కాదు. బీజేపీతో స్నేహం కోసం టీడీపీ పడిగాపులు కాస్తోంది. కానీ బీజేపీ మాత్రం ఖాతరు చేయట్లేదు. టీడీపీని కనీసం పట్టించుకోవట్లేదు. కానీ చంద్రబాబు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా బీజేపీ వెంట పడుతూనే ఉన్నారు. అడగకపోయినా తానున్నానంటూ బీజేపీకి స్నేహహస్తం అందిస్తున్నారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా వైసీపీ, టీడీపీ మరోసారి తాము బీజేపీ వెంటేనని చెప్పకనే చెప్పాయి.













