Tamilnadu: కార్తీక దీపంపై గొడవ.. తమిళనాడులో సరికొత్త రాజకీయం!
తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపరంకుండ్రం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో మొదటిది. కార్తీక మాసంలో ఇక్కడి కొండపై దీపం వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ, భక్తిశ్రద్ధలతో వెలిగించాల్సిన ఈ దీపం ఇప్పుడు ఓ పెద్ద రాజకీయ, న్యాయపరమైన దావానలంగా మారింది. ‘ఇది మా స్థలం’ అంటూ ఒక వర్గం, ‘అది మా హక్కు’ అంటూ మరొక వర్గం చేస్తున్న పోరాటం.. ఇప్పుడు “అసలు అక్కడ ఉన్నది దేవుడి స్థంభమా? లేక సర్వే రాయా?” అనే వింత వాదన వరకు వెళ్ళింది.
తిరుపరంకుండ్రం కొండపై కాశీ విశ్వనాథుడి ఆలయం, మురుగన్ పాదాలు ఉన్నాయని, అక్కడ కార్తీక దీపం వెలిగించడం తమ హక్కు అని హిందువులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే, అదే కొండపై సికందర్ బాదుషా దర్గా ఉండటంతో.. ఆ కొండ మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినదని, అక్కడ హిందువులు దీపం వెలిగించడానికి వీల్లేదని దర్గా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతిభద్రతల సాకుతో పోలీసులు కూడా హిందువులకు అనుమతి నిరాకరించారు. దీంతో విషయం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ మెట్లెక్కింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, కేవలం కాగితాలను నమ్ముకోకుండా స్వయంగా కొండను పరిశీలించారు. అక్కడ ఉన్న పురాతన శిలాశాసనాలు, రాతి కట్టడాలను చూసి.. ఆ కొండ కేవలం ఒక వర్గానికి చెందినది కాదని, అది రెవెన్యూ శాఖకు చెందిన పోరంబోకు భూమి అని తేల్చారు. “హిందువులకు దీపం వెలిగించుకునే హక్కు ఉంది” అని తీర్పునిస్తూ, దేశ సమగ్రత గురించి, ‘భరతమాత’ గురించి ప్రస్తావించారు. ఇది హిందూ సంఘాలకు పెద్ద ఊరటనిచ్చింది.
న్యాయమూర్తి తీర్పు తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకి, దాని మిత్రపక్షాలైన వామపక్షాలు, వీసీకే, మైనారిటీ పార్టీలకు మింగుడు పడలేదు. తీర్పులోని అంశాలను వ్యతిరేకించడం మానేసి, న్యాయమూర్తి వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేశారు. ఆయన హిందూత్వ ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఏకంగా ఆయనను పదవి నుంచి తొలగించాలని పార్లమెంటు స్పీకర్‌కు లేఖ రాశారు. ఒక తీర్పు నచ్చకపోతే జడ్జిపైనే కక్ష సాధింపు చర్యలకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ వివాదం ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అక్కడ ప్రభుత్వం వినిపించిన వాదన అందరినీ విస్మయానికి గురిచేసింది. పిటిషనర్లు చెబుతున్నట్లు కొండపై ఉన్నది పవిత్రమైన కార్తీక దీపస్తంభం కాదని పేర్కొంది. అది బ్రిటీష్ కాలంలోనో, అంతకు ముందో భూములను కొలిచేందుకు పాతిన కేవలం ఒక సర్వే రాయి మాత్రమేనని చెప్పింది. దానికి మతపరమైన పవిత్రత లేదని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఆ రాతికి ఉన్న పవిత్రతను సాంకేతికంగా దెబ్బతీస్తే, అక్కడ పూజలు చేసే హక్కును చట్టపరంగా నిరాకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జస్టిస్ స్వామినాథన్ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరింది.
మరోవైపు రాజకీయ నాయకులు జడ్జిని టార్గెట్ చేయడాన్ని మాజీ న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల బృందం జస్టిస్ స్వామినాథన్‌కు అండగా నిలిచింది. “చట్టం, సాక్ష్యాల ఆధారంగా తీర్పునిచ్చిన న్యాయమూర్తిని అభిశంసన పేరుతో బెదిరించడం న్యాయవ్యవస్థ స్వేచ్ఛపై దాడి చేయడమే” అని వారు స్పష్టం చేశారు. ఈ బెదిరింపులకు భయపడకూడదని ప్రస్తుత న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు గురించి మాట్లాడుతున్న పవన్, ఈ ఘటనను తీవ్రంగా తప్పుబట్టారు. “న్యాయస్థానాలు వాస్తవాలు మాట్లాడితే, ఆ జడ్జీలపైనే అభిశంసన పెడతారా? ఇదేనా సెక్యులరిజం? తిరుపరంకుండ్రంలో దీపం వెలిగించడం అక్కడి ఆచారం. దానిని అడ్డుకోవడం, న్యాయం చెప్పిన జడ్జిని వేధించడం సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిలో భాగమే. న్యాయమూర్తి స్వామినాథన్ గారు భరతమాత గురించి మాట్లాడితే తప్పేముంది?” అని పవన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ధర్మాన్ని కాపాడే వ్యవస్థలకు అండగా ఉండాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన సంకేతాలిచ్చారు.
ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ పరిధిలో ఉంది. ప్రభుత్వం సర్వే రాయి అనే సాంకేతిక పాయింట్‌తో గెలుస్తుందా? లేక వేల ఏళ్ల విశ్వాసం, న్యాయమూర్తి స్వామినాథన్ పరిశీలనలో తేలిన నిజాలు నిలబడతాయా? అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, ఒక దీపం వెలిగించే అంశం.. దేశంలోని లౌకికవాద నిర్వచనాన్ని, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించే స్థాయికి వెళ్లడం గమనార్హం.






