కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి కారకుడితనే..!
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అంచనాలను తలకిందులు చేస్తూ క్లియర్ కట్ మెజారిటీ సాధించింది. ఎన్ని ఇబ్బందులు, నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పనైపోయిందనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ బంతిలాగా దూసుకొచ్చింది. అయితే ఇదంత ఆషామాషీగా దక్కిన గెలుపు కాదు. దీని వెనుక ఎందరో పని చేశారు. వ్యూహాలు రచించారు. ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు వెనుక ఓ వ్యక్తి ప్రధాన పాత్ర పోషించారు.
ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ సలహాదారుల సేవల్లో మునిగి తేలుతున్నాయి. ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు.. లాంటి ఎందరో సలహాదారులు వివిధ పార్టీలకు సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలంగా సునీల్ కనుగోలు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది జరిగే దేశ సార్వత్రిక ఎన్నికలకు సునీల్ కనుగోలు వర్క్ చేస్తున్నారు. కర్నాటక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలంగాణ, మధ్యప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటికే పని మొదలు పెట్టారు. చత్తీస్ గఢ్, రాజస్థాన్ బాధ్యతలు కూడా సునీల్ టీమ్ చూస్తోంది.
సునీల్ కనుగోలు కర్నాటకకు చెందిన వ్యక్తి. తమిళనాడులో చదువుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ టీమ్ లో బీజేపీకోసం పని చేశారు. 2014లో మోదీని ప్రధానమంత్రిని చేసేందుకు పని చేసిన టీమ్ లో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2018 వరకూ బీజేపీ టీమ్ సం పని చేశారు. అనతంరం ప్రశాంత్ కిశోర్ టీమ్ నుంచి బయటికొచ్చారు. సొంతంగా సలహా సంస్థను ప్రారంభించి కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు కర్నాటకలో అభ్యర్థుల ఎంపిక మొదలు క్షేత్రస్థాయి సర్వేలు చేసి ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు.
గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన సునీల్ కనుగోలును రెండు నెలలకే కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ లో నియమించారు సోనియా గాంధీ. దీన్ని బట్టి సునీల్ కనుగోలు పనితీరుపై కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో సంతృప్తిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా భావించిన రాహుల్ జోడో యాత్రకు సునీల్ కనుగోలు అన్నీ తానై చూసుకున్నారు. ఈ యాత్ర కర్నాటక ఎన్నికలకు ఎంతో దోహదపడిందని ఇప్పుడు భావిస్తున్నారు.
ఇప్పుడు సునీలు కనుగోలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల టార్గెట్ గా పని చేస్తున్నారు. ఓ వైపు రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే ఉద్దేశంతో సునీల్ కనుగోలు వ్యూహాలు రచిస్తున్నారు. సునీల్ కనుగోలుపై కాంగ్రెస్ పార్టీ ఎంతో హోప్స్ పెట్టుకుంది. అందుకు తగ్గట్టే సునీల్ కనుగోలు కూడా ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు.













