కేజ్రివాల్ సక్సెస్ సీక్రెట్ ఏంటి..? ఆప్‌కు ఎలా సాధ్యమవుతోంది?
కొంతమంది అడుగులు చూసేవాళ్లకు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కానీ ఆ అడుగులు వేసే వాళ్లకు మాత్రం పూర్తి క్లారిటీ ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ కూడా ఈ కోవకే చెందుతారు. పదేళ్ల కిందటివరకూ కేజ్రివాల్ అంటే ఆయనో సంఘసంస్కర్త, విద్యావేత్త అని మాత్రమే తెలుసు. అన్నాహజారే జన్ లోక్ పాల్ ఉద్యమం ద్వారా కేజ్రివాల్ పేరు మార్మోగింది. అన్నా హజారేతో కలిసి ఆయన లోక్ పాల్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అన్నా హజారేతో విభేదించి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కేజ్రివాల్. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి ఢిల్లీలో పోటీ చేశారు. అలా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కేజ్రివాల్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దారు. గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల తర్వాత ఆప్ నేషనల్ పార్టీ జాబితాలో చేరింది.
బీజేపీకి ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయం ఎవరంటే కాంగ్రెస్ అని చెప్పేవాళ్లు. కానీ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుండడంతో ఆ స్థానాన్నిభర్తీ చేసేందుకు తామున్నామంటూ ముందుకొస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఆ స్థానాన్ని భర్తి చేస్తోంది. గుజరాత్ లో కూడా ఇదే జరిగింది. గుజరాత్ లో ఆప్ పోటీ చేయకుండా ఉంటే కాంగ్రెస్ మరిన్ని మెరుగైన సీట్లు, ఓట్లు సాధించేది. ఇక్కడ ఆప్ వల్లే దెబ్బతిన్నామని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. అంతేకాదు.. బీజేపీని గెలిపించేందుకే ఆప్ ఇక్కడ పోటీ చేసిందని ఆరోపిస్తోంది. పార్టీల మధ్య ఇలాంటి విమర్శలు – ప్రతివిమర్శలు మామూలే. వాటిని పక్కన పెడితే ఆప్ రోజురోజుకూ బలపడుతోందన్న మాట వాస్తవం.
ఢిల్లీలో తొలిసారి చీపురు పట్టి అధికారంలోకి వచ్చినప్పుడు ఏంటీ ఆప్, ఎవరీ కేజ్రివాల్ అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఢిల్లీ ప్రజలు ఆప్ కు ఆస్థాయిలో పట్టం కట్టారు. అక్కడ కేజ్రివాల్ చేపట్టిన విద్య, ఆరోగ్య రంగ సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయి. రెండో సారి కూడా మొదటి విడత కంటే ఎక్కువ సీట్లతో ఢిల్లీ ప్రజలు ఆప్ ను గద్దెనెక్కించారంటే ఆ పార్టీకి అక్కడ దక్కిన ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వరుసగా రెండుసార్లు ఢిల్లీలో అధికారంలోకి రావడంతో ఆప్ జోరు పెంచింది. అదే ఉత్సాహంతో ఉత్తరాదిన మరింత విస్తరించేందుకు కేజ్రివాల్ ప్రణాళికలు రూపొందించుకున్నారు.
పంజాబ్ పై కన్నేసిన కేజ్రివాల్ ఇప్పుడు అక్కడ కూడా అధికారం సాధించగలిగారు. స్థానిక సమస్యలను గుర్తించడం, వాటిని అడ్రస్ చేయడం, ఉచిత విద్యుత్, నీరు, విద్య, ఆరోగ్యం లాంటి మౌలిక వసతులపైనే ఆప్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. సామాన్యులకు కోరుకునేది కూడా ఇదే. అకౌంట్లలో డబ్బు వేయకపోయినా పర్లేదు కానీ తాము ఉన్నచోట కనీస వసతులు ఉండాలని కోరుకుంటారు. ఆప్ అదే చేస్తోంది. ఢిల్లీ సూత్రాన్ని పంజాబ్ లో అమలు చేయడంతో వర్కవుట్ అయింది. దీంతో అక్కడ అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత గోవాపై ఫోకస్ పెట్టింది ఆప్. అక్కడ 2 సీట్లు, 6 శాతం ఓట్లు సాధించింది.
ఆదే జోష్ తో గుజరాత్ లో కూడా పాగా వేస్తామని ఆప్ భావించింది. అయితే అధికారం దక్కలేదు కానీ అక్కడ 12 శాతం ఓట్లు సాధించింది. 5 సీట్లు కూడా దక్కాయి. దీంతో ఆప్ కు జాతీయ హోదా దక్కింది. హిమాచల్ ప్రదేశ్ లో ఆప్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. పదేళ్లలోనే ఒక పార్టీకి జాతీయ హోదా దక్కడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆప్ అది సాధించింది. ఉత్తరాది పార్టీ కావడం, కేజ్రివాల్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు వర్కవుట్ కావడం ఆప్ కు కలిసొస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడం కూడా ఆప్ కు కలిసొస్తోంది. బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంటోంది. దీంతో ఆప్ అనుకున్న లక్ష్యం చేరుకుంటోంది.













