విపక్షా కూటమికి స్టాలిన్ అందుకే దూరంగా ఉంటున్నారా?
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పై పలువురు విపక్ష నేతలు ఏకతాటి పైకి వచ్చారు. కేంద్రంలో నిరంకుషత్వ పాలన నడుస్తుందని, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ నలుగురు ముఖ్యమంత్రులు సహా విపక్ష నేతలు నేరుగా మోడీకి ఒక లేఖ రాశారు. ఇందులో సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంతు మాన్, మమత బెనర్జీ సహా విపక్షాలకు చెందిన కీలక నేతలు ఉన్నారు. అయితే కెసిఆర్ కు ఎంతో సన్నిహితంగా ఉండి, ప్రధాని మోదీని తీవ్రంగా వ్యతిరేకించే ముఖ్యమంత్రి స్టాలిన్ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఎవరితోనైనా జట్టు కట్టేందుకు, వారితో కలిసి పని చేసేందుకు స్టాలిన్ ఎప్పుడూ ముందుంటారు. బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని స్టాలిన్ పదేపదే చెబుతూ ఉండేవారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడులో కూడా ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య గొడవ నడుస్తోంది. గవర్నర్ తీరును నిరసిస్తూ స్టాలిన్ పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లారు. పైగా చాలా కాలం నుంచి స్టాలిన్ కాంగ్రెస్ తో పని చేస్తున్నారు. బిజెపియేతర పార్టీలతో సన్నిహితంగా ఉన్నారు.
గతంలో మోడీకి వ్యతిరేకంగా జరిగిన పలు కార్యక్రమాల్లో స్టాలిన్ పాల్గొన్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు, స్టాలిన్ కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ సందర్భాల్లో ఇద్దరూ వేదికను పంచుకున్నారు. టిఆర్ఎస్ ఆవిర్భావానికి స్టాలిన్ ను కూడా కెసిఆర్ ఆహ్వానించారు. చెన్నై వెళ్లి స్టాలిన్ పలు సందర్భాల్లో కలిశారు. స్టాలిన్ కూడా కెసిఆర్ తో పని చేసేందుకు ఉత్సాహం చూపించేవారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి మోడీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతాయని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మోడీకి రాసిన లేఖలో స్టాలిన్ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విపక్ష నేతలు లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ స్టాలిన్ కూడా ఎదుర్కొంటున్నారు. అయినా వీళ్ళందరితో కలిసి పని చేసేందుకు స్టాలిన్ ఎందుకు ముందుకు రావడం లేదు అనేది అనుమానాలకు తావిస్తోంది.
ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేసేందుకు కెసిఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నేతలు సుముఖంగా లేరు. కానీ స్టాలిన్ మాత్రం కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నారు. బహుశా విపక్ష నేతలతో కలవక పోవడానికి ఇదికూడా ఒక కారణం కావచ్చు. రెండోది కాలం కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ ప్రధాన మంత్రి అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతుంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం. కాంగ్రెస్ లేకుండా బిజెపియేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదు. ఇలాంటి సమయాల్లో కాంగ్రెస్ యేతర పార్టీలతో జట్టు కట్టి ఉన్న అనుబంధాన్ని కోల్పోవడం స్టాలిన్ కు ఇష్టం లేకపోవచ్చు. ఇది కూడా మరొక కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.













