పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వెనుక భారీ అజెండా..?
వచ్చే ఏడాది మేలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను కాస్త ముందుకు జరిపే ఆలోచనలో మోదీ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం అధికారికంగా ఈ అంశాన్ని ఇప్పటివరకూ వెల్లడించలేదు. అయితే తాజాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఐదు రోజులపాటు నిర్వహించబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకు అనేదానిపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ ఈ సమావేశాల వెనుక హిడన్ అజెండా ఉందని తెలుస్తోంది. కీలక బిల్లులను ఈ సమావేశాల్లో పెట్టి ఆమోదించడం ద్వారా వచ్చే ఎన్నికలకు రాచమార్గం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.
మోదీ కేంద్రంలో ప్రధానిపీఠం చేపట్టినప్పటి నుంచి జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తూనే ఉంది. ఇదిగో అదిగో అంటున్నారు కానీ దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే ఇప్పుడు దీన్ని అమలు చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధమైందని.. అందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో దీనిపై ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడంతో ఇది ఇప్పట్లో అయ్యేది కాదని అర్థమైంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వెనుక ఇంకేదో వ్యూహముందని తేలింది.
జమిలి ఎన్నికలకోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయట్లేదని తేలడంతో వాటిపై ఉత్కంఠ మరింత పెరిగింది. పైగా ఈ సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులు రాబోతున్నాయని కేంద్రమంత్రి చెప్పడం మరింత ఆసక్తి రేపింది. ఈ తొమ్మిదేళ్లలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇటీవలే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఇక శీతాకాల సమావేశాలు మిగిలాయి. ఇంతలోపే ప్రత్యేక సమావేశాలు ప్రకటించడం వెనుక మోదీ సర్కార్ పెద్ద స్కెచ్చే వేసి ఉంటుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదం పొందేందుకే ఏర్పాటు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఏదైనా భారీ అజెండా కావాలని బీజేపీ చూస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి బీజేపీకి ఎంతో దోహదపడ్డాయి. ఇప్పుడు రామమందిరం ఎలాగూ ఉంది. కానీ అంతకుమించిన సెన్సేషన్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందడం ద్వారా వచ్చే ఎన్నికల నుంచే దీన్ని అమలు చేయడం ద్వారా భారీ లబ్ది పొందాలనుకుంటోంది. మహిళలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని గ్రహించిన ఆ పార్టీ ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభిస్తే చరిత్ర సృష్టించినట్లే. ఆ చరిత్రను లిఖించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించబోతోంది.













