సచిన్ పైలట్ ధిక్కారస్వరం.. రాజస్థాన్ కాంగ్రెస్లో మళ్లీ సంక్షోభం!
రాజస్థాన్ కాంగ్రెస్ లో రచ్చ మళ్లీ మొదటికొచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పార్టీ అధిష్టానం మాట కాదని నిరసన దీక్ష చేపట్టారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో ఆయన జైపూర్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. సచిన్ పైలట్ ను నిరాహార దీక్ష చేయొద్దని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఒకవేళ పార్టీ మాట కాదని నిరసన చేపడితే వ్యతిరేక చర్యగానే చూడాల్సి ఉంటుందని హెచ్చరించింది. పార్టీలో ఎలాంటి సమస్య ఉన్నా అంతర్గతంగా చర్చించుకుని ముందుకు వెళ్లాలని సూచించింది. అయితే పార్టీ మాటను సచిన్ పైలట్ ఏమాత్రం ఖాతరు చేయలేదు.
గత బీజేపీ ప్రభుత్వం అనేక అవినీతి చర్యలకు పాల్పడిందని, దానిపై చర్యలు తీసుకోవాలని సచిన్ పైలట్ ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చడంలో తాత్సారం జరుగుతోందనేది సచిన్ పైలట్ ఆవేదన. అందుకే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. అయితే దీన్ని ధిక్కారంగా పరిగణించవద్దని, అవినీతిపై సమరంగానే చూడాలని సచిన్ పైలట్ చెప్తున్నారు. గతంలో పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచిస్తున్నారు.
రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్ కు, సచిన్ పైలట్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో ఉంది. గత ఎన్నికల సమయంలోనే సీఎం సీటు కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. అయితే అధిష్టానం చివరకూ అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు చూపింది. అసంతృప్తితోనే సచిన్ పైలట్ అంగీకరించారు. అప్పటి నుంచి పార్టీ మాట కాదనకుండా వస్తున్నారు. అయితే ఇప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం దక్కట్లేదనే ఆవేదన సచిన్ పైలట్ కు ఉంది. అందుకే పైలట్ పార్టీ మారడం ఖాయమని అడపాదడపా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. పైలట్ బీజేపీలో చేరబోతున్నారని ఒకానొక సమయంలో జోరూగా వార్తలు వినిపించాయి.
ఇప్పుడు పైలట్ పార్టీని ధిక్కరించి నిరసన చేపట్టడంతో మరోసారి పార్టీ మార్పు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్లేందుకే కాంగ్రెస్ పార్టీపై ఆసంతృప్తి స్వరం వినిపిస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరి నేతృత్వంలో ఎలక్షన్స్ కు వెళ్లాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పైన ఉంది. అందుకే సచిన్ పైలట్ బల నిరూపణకోసమే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని కొందరు అంటున్నారు. ఏదేమైనా రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం మరోసారి తెరపైకి వచ్చింది.













