వీధికెక్కిన రాజస్థాన్ కాంగ్రెస్ రచ్చ..! నిలువునా చీలడం ఖాయమా..?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్ మాత్రమే. అయితే ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆ రాష్ట్రాన్ని కూడా చేజేతులా పొగొట్టుకునే దిశగా సాగుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య సాగుతున్న వైరానికి చెక్ పెట్టలేక కాంగ్రెస్ హైకమాండ్ తలలు పట్టుకుంటోంది. మూడేళ్లుగా సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు తారస్థాయికి చేరింది. అశోక్ గెహ్లాట్ టార్గెట్ గా సచిన్ పైలట్ యుద్ధ భేరి మోగించారు. దీంతో ఏం చేయాలో కాంగ్రెస్ అధిష్టానానికి అర్థం కావడం లేదు.
ముడేళ్లక్రితం రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అప్పటి పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ సీఎం స్థానాన్ని ఆశించారు. అయితే సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ వర్గీయులంతా ఆయనే సీఎం కావాలని పట్టుబట్టడంతో ఆయనకే కుర్చీ అప్పగించింది హైకమాండ్. సచిన్ పైలట్ కు సర్ది చెప్పింది. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య విభేదాలున్నా సర్దుకుపోతూ వచ్చారు. అయితే సచిన్ పైలట్ చేసిన కొన్ని డిమాండ్లకు అశోక్ గెహ్లాట్ నుంచి సానుకూల స్పందన్ రాలేదు. దీంతో గెహ్లాట్ రివర్స్ అయ్యారు.
గత బీజేపీ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపించాలనేది సచిన్ పైలట్ మొదటి డిమాండ్. అయితే ఇందుకు అశోక్ గెహ్లాట్ అంగీకరించలేదు. పైగా .. 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు తనను కాపాడింది వసుంధర రాజేనే అంటూ కామెంట్ చేశారు. ఇది మరింత అగ్నికి ఆజ్యం పోసేలా చేసింది. అశోక్ గెహ్లాట్ కు సోనియా గాంధీ నాయకురాలు కాదేమోనని.. వసుంధర రాజేనేమో.. అని సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు. అందుకే ఆమె హయాంలో జరిగిన అక్రమాలపై అశోక్ గెహ్లాట్ విచారణ జరిపించడం లేదని ఆక్షేపించారు.
వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ ఇప్పటికే ఒకరోజు నిరాహార దీక్ష చేశారు సచిన్ పైలట్. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, పార్టీ నిర్ణయాన్ని కూడా జవదాటడం లేదని పైలట్ చెప్తున్నారు. తాజాగా.. 11 నుంచి ఐదు రోజులపాటు 125 కిలోమీటర్ల మేర జన సంఘర్ష్ యాత్ర చేపట్టేందుకు సచిన్ పైలట్ సిద్ధమయ్యారు. ఇది పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం అని అశోక్ గెహ్లాట్ చెప్తున్నారు. అయినా సచిన్ పైలట్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. మొత్తానికి రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది.













