మోదానీ ఇష్యూకి, రాహుల్ అనర్హతకు సంబంధం ఉందా..? లేదా..?
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఇదంతా రాహుల్ గాంధీ మోదీ-అదానీ సంబంధాలను ప్రశ్నించడం వల్లే జరిగిందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే బీజేపీ మాత్రం అసలు అదానీ-మోదీ ఇష్యూకు, రాహుల్ గాంధీ అనర్హతకు సంబంధమే లేదని వాదిస్తోంది. అయితే బీజేపీ వాదనను పట్టించుకునేవాళ్లే లేరు. కాంగ్రెస్ నేతలంతా రాహుల్ గాంధీ ప్రశ్నించడం వల్లే ఆయనపై వేటు పడిందని ప్రచారం చేస్తున్నారు. దీంతో మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించడం వల్లే ఆయనపై అనర్హత వేటు వేశారని జనమంతా నమ్ముతున్నారు.
వాస్తవానికి రాహుల్ గాంధీ అనర్హత అంశం వేరు. అదానీ-మోదీ ఇష్యూ వేరు. అదాని గ్రూపు సంస్థల్లో డొల్ల కంపెనీల పెట్టుబడులు, అమాంతం ఆ కంపెనీ ఎదిగిన తీరు.. లాంటి అంశాలపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఈ ఏడాది జనవరి 24న వెల్లడించింది. అప్పటి నుంచి అదానికి మోదీ చేసిన మేలుపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. అదానీ గ్రూపులోకి వచ్చిన 20వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరుతున్నారు. అయితే ఈ అంశంపై చర్చించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎలాంటి చర్చా లేకుండానే ఈసారి వాయిదాలతో ముగిశాయి.
ఇదే సమయంలో రాహుల్ గాంధీ 2019లో చేసిన కామెంట్స్ కు సంబంధించి కేసు విచారణ సూరత్ కోర్టులో వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ కర్నాటకలోని కోలార్ లో ప్రచారం నిర్వహించారు. అప్పుడు లలిత్ మోదీ, నీరవ్ మోదీ లాంటి వాళ్లను ఉటంకిస్తూ ఈ దొంగలందరికీ మోదీనే ఇంటిపేరుగా ఎందుకు ఉంటుందో.. అన్నారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. 2021 జూన్ 24న రాహుల్ గాంధీ తొలిసారి స్టేట్ మెంట్ ఇచ్చారు. 2022 మరోసారి రాహుల్ ను పిలిపించాలని పిటిషనర్ కోరారు. అయితే జడ్జి దవే ఇందుకు నిరాకరించారు.
2022 మార్చి 7న పిటిషనర్ పూర్ణేష్ మోదీ హైకోర్టును ఆశ్రయించి ఈ కేసు విచారణ ఆపేయాలని కోరారు. 2023 జనవరిలో కేసు విచారిస్తున్న జడ్జి దవే బదిలీ అయ్యారు. ఆయన బదిలీ అవగానే హెచ్.హెచ్.వర్మ అనే ఆయన ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. గత నెల 27న ఈ కేసు విచారణ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నెల 23న రాహుల్ కు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ఆ వెంటనే లోక్ సభ సెక్రటేరియేట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది.
ఇక్కడ అదానీ-మోదీ అంశం వేరు.. సూరత్ కోర్టు ఇష్యూ వేరు. అయితే రెండున్నరేళ్లుగా మరుగున పడిపోయిన కేసును ఆగమేఘాల పైన తెరపైకి తీసుకురావడం, పిటిషనర్ కోరినట్లు జడ్జి ఆదేశాలివ్వకపోవడంతో ఆయన బదిలీ అయి వేరొక జడ్డి బాధ్యతలు తీసుకోవడం.. ఆ వెంటనే రాహుల్ కేసు మళ్లీ తెరపైకి రావడం, శిక్ష పడడం చకచకా జరిగిపోయాయి. దీంతో చాలా మంది మోదాని అంశానికి, దీనికి సంబంధం ఉందని అనుకుంటున్నారు.













