డరో మత్..! మరింత గట్టిగా ప్రశ్నించే ఛాన్స్ దొరికింది.. అనర్హతపై రాహుల్ గాంధీ రియాక్షన్
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువునష్టం దావా కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడడంతో లోక్ సభ సెక్రటేరియేట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో 8 ఏళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా పోయింది. కోర్టు తీర్పు వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే లోక్ సభ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది.
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కర్నాటకలోని కోలార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ మోదీ పేరు పెట్టుకున్న వాళ్లంతా దొంగలే అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ నేత కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇన్నాళ్లూ దీనిపై విచారణ సాగలేదు. కానీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు సూరత్ కోర్టు విచారణ చేపట్టి రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజులు గడువిచ్చింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రజాప్రతినిధి ఎవరికైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడితే వాళ్లు పదవిలో ఉండేందుకు అనర్హులు. దోషిగా తేలిన నాటి నుంచి ఇది వర్తిస్తుంది. అంటే మార్చి 23, 2023 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇక 8 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు. దీన్ని బట్టి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీకి అనర్హుడు.
రాహుల్ గాంధీని ఎదుర్కోలేకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయినా భయపడేది లేదని, ఆదాని-మోదీ వ్యవహారంపై తమ వైఖరి మారదని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ ప్రజాప్రతినిధిని కాబట్టి ప్రశ్నించేందుకు కొంచెం ఇబ్బంది ఎదురైందని.. ఇప్పుడు కాదు కాబట్టి మరింత గట్టిగా ప్రశ్నించేందుకు వీలు కలిగిందని రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ గాంధీ పోరాటం ఆగదని.. కాంగ్రెస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఆగమేఘాలపై చర్యలు తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పైగా లోక్ సభ సెక్రటేరియేట్ కు అనర్హత వేటు వేసే అర్హత లేదని వాదిస్తోంది.













