కామన్ మ్యాన్ రాహుల్..! పాదయాత్రలో యువరాజు రెండో కోణం..!
రాహుల్ గాంధీ.. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన యువరాజు. గాంధీ కుటుంబ వారసుడు. దేశానికి సేవ చేసిన, ప్రాణాలర్పించిన కుటుంబం నుంచి వచ్చిన యువనేత. దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీకి వెన్నెముక లాంటి కుటుంబం గాంధీ ఫ్యామిలీ. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల వారసత్వాన్ని తీసుకున్న నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని భావి తరాలకు తీసుకెళ్లడంలో రాహుల్ పాత్ర కీలకం. అందుకే ఆ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారాయన. పార్టీని బలోపేతం చేయడం కోసం భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన దేశవ్యాప్త పర్యటన చేస్తున్నారు. ఈ యాత్రలో ఆయనలోని ఎన్నో కోణాలు ఆవిష్కృతమయ్యాయి.
పదవులు గాంధీ కుటుంబానికి కొత్త కాదు. ఆర్థిక పరిపుష్టి కలిగిన ఫ్యామిలీ. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆ కుటుంబం అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలు ఉన్నారు. అదీ గాంధీ ఫ్యామిలీకి ఉన్న పట్టు. అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి, పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఓ వైపు కేసులు, మరోవైపు పార్టీ రోజురోజుకూ దిగజారుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా రాహుల్ గాంధీ పార్టీని బతికించే బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానన్నా తీసుకోకుండా ఓ సామాన్య కార్యకర్తలా పార్టీకి పనిచేస్తానని ప్రకటించాడు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఎండనకా వాననకా సాగుతున్న యాత్రలో ఆయన ఎక్కడా వెనుకడుగు వేయట్లేదు. రోజురోజుకూ రాహుల్ గాంధీలోని కొత్త వ్యక్తి దేశానికి పరిచయం అవుతున్నారు. పాదయాత్ర ప్రారంభించక ముందు నుంచే రాహుల్ గాంధీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మూడు నెలలకోసారి రాజకీయాల నుంచి విరామం తీసుకుని ఫారిన్ కు చెక్కేస్తారని.. పార్ట్ టైం పొలిటీషియన్ అని.. రాజకీయాల పట్ల చిత్తశుద్ధి లేదని.. పప్పు అని.. ఇలా ఎన్నో విమర్శలు రాహుల్ ను చుట్టుముట్టాయి. పాదయాత్రకు కూడా మధ్యలోనే గుడ్ బై చెప్పేసి ఏ ఇటలీకో, ఫ్రాన్స్ కో చెక్కేస్తారని సెటైర్లు వచ్చాయి. కానీ రాహుల్ వీటని లెక్కచేయలేదు.
పాదయాత్రలో రాహుల్ పరిణతి స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నత కుటుంబానికి వ్యక్తి అనే ఛాయలు లేకుండా ఒక కామన్ మ్యాన్ లా రాహుల్ జనంతో మమేకమైపోతున్నారు. పాదయాత్రలో జనంతో మమేకం కావడానికి తన సెక్యూరిటీ వింగ్ ను కూడా దాటి వెళ్లిపోతున్నారు. రాహుల్ ను కలిసేందుకు వచ్చిన విద్యార్థులను అక్కున చేర్చుకున్నారు. ఓ సోదరుడిలా వారితో కలిసిపోయారు. తనను చూసి ఉద్వేగానికి గురైన విద్యార్థిని తలపై చెయ్యి వేసి హత్తుకున్నారు. చాక్లెట్లు ఇచ్చారు.. ఇక దారి మధ్యలో చెరుకు బండి దగ్గరకు వెళ్లి ఓ గడను తీసుకుని కొరికి తిన్నారు. తాను అడిగితే చెరకు రసాన్నే అందించే యంత్రాంగం ఉంటుంది. కానీ అవేవీ రాహుల్ కు గుర్తు రాలేదు. తానే నేరుగా బండి దగ్గరకు వెళ్లి లాక్కొని అక్కడే కొరికి తిన్నారు. ఇది చూసిన జనం వావ్ అనుకున్నారు.
ఇవాళ కర్నాటకలో రాహుల్ గాంధీ పాదయాత్రలో తల్లి సోనియా జాయిన్ అయ్యారు. రాహుల్ తో కలిసి సోనియా కూడా కాసేపు నడిచారు. తనతో పాటు నడుస్తున్న తల్లిని చూసి రాహుల్ చలించిపోయారు. తన ఆరోగ్యం సరిగా లేదని గ్రహించి.. నడవద్దని.. వెళ్లి కారులో కూర్చోవాలని తల్లని కోరారు. కానీ తల్లి తనకు బాగానే ఉందని.. కాసేపు నడుస్తానని రాహుల్ తో కలిసి కాలు కదిపారు. కాస్త దూరం వెళ్లగానే తల్లి సోనియా షూ లేస్ ఊడిపోయిన విషయాన్ని రాహుల్ గ్రహించారు. వెంటనే తల్లి దగ్గరకు వెళ్లి షూ లేస్ కట్టారు. ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
రాహుల్ గాంధీతో పాదయాత్ర చేస్తున్నవారు.. ఆయన పాదయాత్రను కవర్ చేస్తున్న వారూ ఆయనలోని సామాన్యుడి కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రధాన మీడియా ఆయన పాదయాత్రపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ జపం నడుస్తోంది. ఆయనలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తోంది. మరి చూడాలి ఈ యాత్ర రాహుల్ కు, కాంగ్రెస్ పార్టీకి ఎంతమేర లబ్ది చేకూర్చుతుందో..!













