పీకే డబుల్ స్టాండర్డ్స్..! వ్యూహకర్తగా ఒక మాట.. రాజకీయ నాయకుడిగా మరో మాట..!
ఇన్నాళ్లూ రాజకీయ పార్టీలకు సేవ చేసి పలువురు నేతలను అందలం ఎక్కించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తానే అధికార పీఠంపై కూర్చోవాలని తపిస్తున్నారు. అందుకు బీహార్ ను వేదికగా ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్ర కూడా ప్రారంభించారు. అయితే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు.. లాంటి అంశాలపై మాట్లాడిన మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
రాజకీయాలను కొత్తపుంతలు తొక్కించవచ్చని నిరూపించిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. పీకే అడుగు పెట్టక ముందు వరకూ రాజకీయ నేతలంతా స్వశక్తినే నమ్ముకునేవారు. నేరుగా ప్రజలను కలిసి ఓట్లు అడిగేవారు. తమదైన వ్యూహాలతో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేవారు. ఏదైనా అంశంపై విమర్శలు సహజం. వాటిని తమదైన శైలిలో ఎదుర్కొనేవారు. కానీ ప్రశాంత్ కిశోర్ అడుగు పెట్టాక సోషల్ మీడియా ద్వారా విషబీజాలు నాటే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. విమర్శలు హద్దులు దాటాయనే ఆరోపణలున్నాయి. వ్యతిరేక పార్టీలను బజారుకీడ్చేలా పీకే టీం వ్యవహరిస్తోందని పలు పార్టీలు ఆరోపించాయి.
ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ నేరుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. వారసత్వ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తండ్రి తర్వాత కొడుకే రాజకీయాల్లోకి రావాలన ఆలోచన నుంచి పార్టీలు బయటకు రావాలన్నారు. ప్రజలు కూడా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయవద్దని సూచించారు. అంతేకాక.. కులం, మతం, సిద్ధాంతాలు.. లాంటి వాటిని కాకుండా నాయకుడు ఎలాంటివాడో చూసి ఓట్లు వేయాలని కోరారు. భవిష్యత్ తరాలకు నాయకుడు మంచి విద్య అందిస్తాడో లేదో చూడాలన్నారు. ఇప్పుడు పీకే చేసిన ఈ కామెంట్స్ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. కానీ ఇప్పటివరకూ పీకే పలు వారసత్వ పార్టీలకే సేవలందించారు. ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్ తదితరులు వారసత్వ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన పీకే.. వాళ్లకెందుకు సేవలందించారని ఇప్పుడు సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అంతేకాదు.. కులాలు, మతాలు, వర్గాల వారీగా ఓట్లను చీల్చి రాజకీయాలను కొత్తపుంతలు తొక్కించింది ప్రశాంత్ కిశోరే. ఇలా కూడా జనాలను చీల్చవచ్చని రుచి చూపించారు పీకే.
వ్యూహకర్తగా సేవలందించేటప్పుడు వారసత్వ రాజకీయాలు, కులాలు, మతాలు, వర్గాలు కరెక్ట్. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన తర్వాత ఇవన్నీ రాంగ్. ఇది ప్రశాంత్ కిశోర్ సిద్ధాంతం. జనాల్లో విషబీజాలు నింపి.. కులమతాల వారీగా ఓట్లు చీల్చి వారసులను అందలం ఎక్కించిన పీకే.. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు జనాలు. వ్యూహకర్తగా ఒక విధానం, రాజకీయ నాయకుడిగా మరో విధానం.. కరెక్ట్ కాదంటున్నారు. మరి వీటిని పీకే ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.













