ఉత్తరాదిపై ప్రకృతి పగబట్టిందా..?
ప్రకృతి కన్నెర్ర చేస్తే జరిగే పరిణామాలు ఊహకు కూడా అందవు. కుండపోత వర్షాలు, వరదలు, భూకంపాలు, గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఇలా అన్నిరకాలుగా ప్రకృతి విరుచుకు పడినప్పుడు కలిగే విపరిణామాలు మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి. ఇప్పుడు ఉత్తర భారతంలో అదే జరుగుతోంది. కనీవినీ ఎరుగని విధంగా పోటెత్తుతున్న వరదల ధాటికి పలు రాష్ట్రాలు కకావికలం అవుతున్నాయి. అసలేం జరుగుతోందో అర్థం కాక జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ హెచ్చరికలుగా భావించి ఇకనైనా మేల్కోవాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఒక విధంగా ఇది ప్లస్ అయితే మరో రకంగా ఇది మైనస్. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వాతావరణ పరిస్థుతులు మిగిలిన ప్రాంతానికి భిన్నంగా ఉంటాయి. వర్షాకాలంలో భారీ వర్షాలు, వేసవి కాలంలో విపరీతమైన ఎండలు, శీతాకాలంలో వణుకుపుట్టించే చలి ఇక్కడ నమోదవుతుంటాయి. వీటికి తోడు భూకంపాలు, వరదలు, మంచు ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలపై వీటి ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీపై ప్రకృతి విపత్తులు పగబట్టాయనే చెప్పొచ్చు.
హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న జమ్ముకాశ్మీర్ లో చలి విపరీతంగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. అదే సమయంలో అక్కడ భూకంపాలు కూడా విరివిగా సంభవిస్తుంటాయి. వీటి ధాటికి హిమాలయ భూగర్భాలు కదిలిపోతున్నాయని.. మున్ముందు వీటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చాలాకాలంగా పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. కొండచరియలు విరిగిపడడం, భారీగా మంచు కురవడం, మంచు కరిగి వరదలుగా మారి నదులు పోటెత్తడం లాంటివి మనం ఇటీవలికాలంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో వరదలు పోటెత్తుతున్నాయి. భారీ వర్షాలు నమోదు కాకపోయినా వరదలు పోటెత్తడానికి హిమాలయాల్లోని మంచే కారణమని భావిస్తున్నారు. యమునా నది 45 ఏళ్ల తర్వాత ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ, పంజాబ్ లలో శీతాకాలంలో పొగమంచు కమ్మేస్తుంటుంది. మధ్యాహ్నం దాటినా కూడా మంచు కురవడం మనం చూస్తూనే ఉంటాం. దీనికి తోడు కాలుష్యం ప్రమాదస్థాయిని మించుతోంది. దీని వల్ల వాహనాలపై నియంత్రణ విధించాల్సిన పరిస్థితి వస్తోంది. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీని వదిలేసి చాలా మంది పారిపోయే పరిస్థుతులు వస్తున్నాయంటే అక్కడి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్వతప్రాంతాలను తవ్వడం, వాటి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తుండడంతో విపరిణామాలు సంభవిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటివి పునరావృతమైతే ఉత్తర భారతం ఉనికే ప్రశ్నార్థకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.













