తమిళనాడు నుంచి బరిలోకి దిగబోతున్న మోదీ..!!
దక్షిణాదిన పుంజుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఉత్తరాదిన బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ లభిస్తున్న సీట్లతోనే అధికారాన్ని కైవసం చేసుకోగలుగుతోంది. కానీ దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీ దాదాపు శూన్యం అనే చెప్పాలి. కర్నాటక మినహా ఆ పార్టీకి పెద్దగా ఆదరణ లేదు. అందుకే ఈసారి టార్గెట్ సౌత్ పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది బీజేపీ. ఈసారి అధికారంలోకి రావడానికి దక్షిణాదిలో కూడా సీట్లు సాధించడం అత్యవసరం అనే ఫీలింగ్ లో ఉంది బీజేపీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి సీట్లు రావడం కష్టం. అందుకే ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది కమలం పార్టీ. అదే దక్షిణాది నుంచి మోదీ బరిలోకి దిగడం.
దక్షిణాది రాష్ట్రాలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇక్కడి ఫలాలను ఉత్తరాది వాళ్లు అనుభవిస్తున్నారనే ఆవేదన ఇక్కడి ప్రజల్లో ఎంతోకాలంగా ఉంది. కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు కూడా దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నాయి. ఇది రూపు మాపాలంటే దక్షిణాదిపై ప్రేమ చూపించాలి. అది జరగాలంటే ఇక్కడి ప్రజల్లో ముందు స్థానం సంపాదించుకోవాలి. ఇలాంటి ఎత్తుగడలు వేయడంలో బీజేపీ అన్నిటికంటే ముందు ఉంటుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2019తో పోల్చితే ఈసారి సీట్లు తగ్గుతాయనే ఫీలింగులో ఉంది బీజేపీ. అలా కోల్పోయే సీట్లను ఈసారి దక్షిణాది నుంచి రాబట్టుకోవాలనుకుంటోంది బీజేపీ. ముఖ్యంగా తమిళనాడుపై ఫోకస్ పెట్టింది.
కర్నాటకలో బీజేపీ ఓడిపోయింది. తెలంగాణలో గట్టి ఫైట్ ఇస్తామనే నమ్మకంతో ఉంది. ఇక ఏపీలో ఆ పార్టీకి ఛాన్సే లేదు. ఇక మిగిలింది తమిళనాడు, కేరళ మాత్రమే. వీటిలో బీజేపీకి కాస్తోకూస్తో తమిళనాడులో పుంజుకునేందుకు అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే తమిళనాడుపై కొంతకాలంగా దృష్టి పెట్టింది. ఇటీవల పార్లమెంటు కొత్త భవనంలో చోళరాజ వంశీయుల చరిత్రకు అద్దం పట్టే సెంగోల్ ను ఏర్పాటు చేశారు. అంతకుముందు మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో తమిళ కాసీ సంఘం ఉత్సవాలను నెల రోజులపాటు ఘనంగా నిర్వహించారు. అందులో ప్రధాని మోదీ భాగస్వాములయ్యారు. కాశీకి, రామేశ్వరానికి మధ్య బంధాన్ని ఆవిష్కరించి తమిళులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇటీవల తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా తమిళుడిని ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు. అంటే దీని వెనుక నిగూఢ అర్థం ఉందని భావిస్తున్నారు. మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసి ప్రధానిగా ఎన్నికైతే తమిళుడే ప్రధాని అయ్యారే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఈసారి రామేశ్వరం ఉండే రామనాథపురం నుంచి మోదీ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామేశ్వరం ఉన్న రామనాథపురం నుంచి ఎన్నికైతే బీజేపీకి మంచి జోష్ వస్తుంది. అలాగే దక్షిణాది మొత్తం దీని ప్రభావం కనిపిస్తుంది. ఇదే బీజేపీ స్కెచ్ గా భావిస్తున్నారు.













