అదానీ వ్యవహారంలో మౌనం ఎందుకు మోదీ?
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తులు. భారత్ లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నరేంద్ర మోదీ గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవానికి మోదీ జీవితం కూడా పూలపాన్పు కాదు. ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకపోవడం, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ఎదుర్కోవడం మోదీకి అలవాటు. జనానికి మాత్రమే తాను జవాబుదారీ అని నమ్ముతారు మోదీ. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోరు. అలాంటి వాటిని చాలా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు అదానీ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తోంది. అయితే దీనిపైన కూడా మోదీ మౌనంగా ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది.
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అదానీ ఎదుగుదల ఓ రేంజ్ లో కొనసాగుతోంది. అంతకుముందు అంబానీ పేరు మాత్రమే వినిపించేది. అయితే ఇప్పుడు అంబానీని వెనక్కు నెట్టి అదాని ఎక్కడికో వెళ్లిపోయారు. అయితే అదానీ ఈ స్థాయికి ఎదగడానికి మోదీ అండదండలే ప్రధానమని విపక్షాలు మొదటి నుంచి కోడైకూస్తున్నాయి. అయితే మోదీ మాత్రం ఎప్పుడూ ఈ అంశంపై నోరు మెదపలేదు. మోదీ స్టైలే అంత. విపక్షాలు ఎంత గించుకుంటున్నా మోదీ మౌనమే సమాధానం అన్నట్టు సాగిపోయే వారు. కానీ ఇప్పుడు సీన్ అలాంటిది కాదు. అదానీ అక్రమ సామ్రాజాన్ని హిండెన్ బర్గ్ నివేదిక బట్టబయలు చేసింది.
హిండెన్ బర్గ్ నివేదిక కేవలం భారత్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేస్తోంది. ఎందుకంటే అదానీ సామ్రాజ్యం కేవలం భారత్ కు మాత్రమే పరిమితం కాలేదు. పైగా ఆయన ప్రపంచంలోని టాప్ 5 కుబేరుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి అక్రమాలకు పాల్పడి ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించారంటే సహజంగానే ప్రభావం ఆ వ్యక్తిపైనే కాదు. దేశం మొత్తం మీద పడుతుంది. హిండెన్ బర్గ్ దెబ్బకు అదానీ షేర్లు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లు వణికిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అన్నిటికంటే ముఖ్యంగా అదానీలో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ, ఎస్బీఐ లాంటి షేర్లు కూడా పతనమయ్యాయి.
ఎల్ఐసీ, ఎస్పీఐ ప్రభుత్వరంగ సంస్థలు. ఇందుకు ప్రభుత్వమే జవాబుదారీ. అదానికి మేలు చేసేందుకే ఎల్ఐసీ, ఎస్బీఐలాంటి సంస్థలతో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టించిందని విపక్షాలు ఎంతోకాలంగా ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు అదానీ దెబ్బకు ఆ రెండు సంస్థలపై ప్రభావం పడుతోంది. తద్వారా ప్రజలకు నష్టం కలుగుతోంది. ఇది అదానీ కంపెనీ వ్యవహారం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామని కొట్టిపడేశారు. కానీ ఇది ఎంతమాత్రం ఒక కంపెనీకి సంబంధించిన వ్యవహారం కాదు. లక్షలాది మంది పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వరంగ సంస్థల వ్యవహారం. ఇలాంటి వాటిపైన కూడా చర్చించకుండా పారిపోతుండడం మోదీ ప్రభుత్వ అసమర్థతను బయటపెడుతోంది.
వాస్తవానికి ఎలాంటివాటినైనా మోదీ సమర్థంగా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ అదానీ వ్యవహారంలో మాత్రం విపక్షాలు ఎంత గింజుకుంటున్నా మోదీ మాత్రం అస్సలు కేర్ చేయట్లేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో అయినా మోదీ అదానీ వ్యవహారంపై స్పందిస్తారని భావించారు. కానీ అప్పుడు కూడా కాంగ్రెస్, యూపీఏలపైన విమర్శలకే పరిమితం అయ్యారు తప్ప అదాని అంశంపై నోరు మెదపలేదు. దీంతో అదానీ వ్యవహారంలో మోదీ పలాయనవాదాన్ని అవలంబిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.













