కాంగ్రెస్ తో పొత్తు పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నట్లు లేదు. వేటికవే వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ఇప్పటికే కూటములు ఉన్నాయి. అయితే బిజెపిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూటమికి సత్తా సరిపోవట్లేదు. అందుకే కొత్త భాగస్వాముల కోసం కాంగ్రెస్ చూస్తోంది. కానీ కాంగ్రెస్తో కలిసి వచ్చేందుకు ఒకటి రెండు పార్టీల మినహా ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా ముందుకు రావట్లేదు. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కొన్ని పార్టీల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
వచ్చే ఏడాదిలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. బిజెపిని ఓడించాలని కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీలు బలంగా కోరుకుంటున్నాయి. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ, త్రినమూల్ కాంగ్రెస్, జెడియు, సమాజ్వాది పార్టీ, భారత్ రాష్ట్ర సమితి, ఎన్సీపీ, శివసేన లాంటి ఎన్నో పార్టీలు బిజెపి ఓడిపోవాలని గట్టిగా కోరుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా బిజెపిని ఓడించడం అంత ఈజీ కాదు. ఈ విషయం ఈ పార్టీలన్నింటికీ తెలుసు. కానీ వీటిలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేవు. ఇందుకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కారణముంది.
అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు పునరాలోచనలో పడినట్లు అర్థమవుతుంది. త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనం. ఇన్నాళ్లూ కాంగ్రెస్తో పొత్తుకు ససేమిరా అన్న మమతా బెనర్జీ ఇప్పుడు ఆ పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధమేనని ప్రకటించారు. అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని వెల్లడించారు.
ప్రాంతీయ పార్టీలు కలిసి రాక, ఒంటరిగా పోరాడలేక ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతోంది. జెడియు, ఎన్సిపి, శివసేన, అకాళీదళ్ లాంటి పార్టీలు మాత్రమే కాంగ్రెస్తో కలిసి ఉన్నాయి. . ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా తోడైతే సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితులు గణనీయంగా మారే అవకాశం కనిపిస్తుంది. టీఎంసీ, డిఎంకె, బీఆర్ఎస్, ఆప్ లాంటి పార్టీలు కాంగ్రెస్తో కలిసి కూటమిగా ఏర్పడి లోక్సభ ఎన్నికల్లో పోటీ పడితే కచ్చితంగా బిజెపికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. మరి ఈ కూటమి వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.













