LTTE Prabhakaran: పెద్ద పులి బతికే ఉందట..! ఎప్పుడు బయటికొస్తుందో..?
LTTE చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారనే వార్త ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఎల్టీటీఈ పేరు చెప్తేనే శ్రీలంక ఉలిక్కి పడుతుంది. అలాంటి ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారంటూ LTTE సానుభూతిపరుడు, ప్రభాకరన్ కు అత్యంత సన్నిహితుడు ఐన పాణ నెడుమారన్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. త్వరలోనే ప్రభాకరన్ బయటికొస్తారని.. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని నెమడుమారన్ చెప్పుకొచ్చారు. అసలు ఎల్టీటీటీ ప్రభాకరన్ ఎవరు..? ఆయనంటే శ్రీలంకకు ఎందుకంత భయం..?
వేలుపిళ్లై ప్రభాకరన్.. శ్రీలంకలో వేర్పాటువాద తమిళులకు నాయకుడు. లంకలో తమిళులకు ప్రత్యేక రాజ్యం కావాలని పోరాడిన ధీరుడు. జాఫ్నా కేంద్రంగా ఆయన సమాంతర ప్రభుత్వాన్నే నడిపించారు. వేల మంది సైన్యాన్ని తీర్చిదిద్దారు. శ్రీలంక ప్రభుత్వంతో దశాబ్దాలపాటు పోరాడారు. తమిళులను శ్రీలంక ప్రభుత్వం అణచివేస్తోందని.. వారి ఆటవిక పాలన సాగించబోమని శపథం చేసిన ప్రభాకరన్.. వారికోసం అహర్నిశలు శ్రమించారు. భగత్ సింగ్, సుభాశ చంద్రబోస్ ను ఆదర్శంగా చెప్పుకునే ప్రభాకరన్.. ఆయుధంతోనే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మారు. అందుకే ఆత్మాహుతి దళాలను తయారు చేశారు. శ్రీలంక సైన్యాన్ని బెంబేలెత్తించారు.
అయితే దశాబ్దాల పోరాటం అనంతరం 2009 మే 18న ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ ను తాము హతమార్చినట్టు శ్రీలంక సైన్యం ప్రకటించింది. ఆయన శరీరానికి డీఎన్ఏ పరీక్ష కూడా నిర్వహించామని.. ఆ బాడీ ప్రభాకరన్ దేనని ధృవీకరించింది. దీంతో ఎల్టీటీఈ సైన్యం చేతులెత్తేసింది. జనజీవన స్రవంతిలో కలిసిపోయి బతుకుతోంది. జాఫ్నాను తమ ఆధీనంలోకి తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం తమిళుల వేర్పాటువాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో తమిళులు మైనారిటీలుగా ఉండిపోయి బతుకుతున్నారు.
ఇప్పుడు ప్రభాకరన్ చనిపోలేదని.. ఆరోగ్యంగా ఉన్నారని ఆయన సన్నిహితుడు పాణ నెడుమారన్ చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభాకరన్ మళ్లీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. ప్రభుత్వంలో అస్థిరత నెలకొంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతోంది. నిత్యావసరాల దరలు మండిపోతున్నాయి. ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రభాకరన్ బయటికొచ్చే సమయం ఆసన్నమైందని నెడుమారన్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎప్పుడు బయటికొస్తారనేది మాత్రం చెప్పలేదు. ఎవరో దారినపోయే దానయ్య ఈ ప్రకటన చేసి ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెడుమారన్ .. ప్రభాకరన్ తరపున ఎన్నో పనులు చక్కదిద్దిన వ్యక్తి. ఆలాంటి వ్యక్తి ఈ ప్రకటన చేయడంతో పెద్ద సంచలనమే అవుతోంది.













