ఢిల్లీలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్..! బీజేపీయేతర పార్టీలకు ఆహ్వానం..!
కేసీఆర్ వ్యూహాలు ఒక పట్టాన అర్థం కావు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అస్సలు అర్థం కాదు. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాలన్న ఆయన నిర్ణయం కూడా అలాంటిదే. దేశంలో ఎంతోమంది సీనియర్ నేతలున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయస్థాయిలో చక్రం తిప్పారు. కానీ వాళ్లెప్పుడూ తమ ప్రాంతీయ పార్టీని వదిలేసి జాతీయ స్థాయి పార్టీలు పెట్టలేదు. రాష్ట్రంలో బలంగా నాటుకుపోవాలనుకున్నారు. నేల విడిచి సాము చేయలేదు. కానీ అలా చేస్తే కేసీఆర్ ఎందుకవుతారు?
దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం చేసుకున్నారు కేసీఆర్. ఆరోజు నుంచి స్పీడ్ పెంచాలని డిసైడయ్యారు. అందుకోసం ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కసారి పార్టీ ప్రకటించాక దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలనేది కేసీఆర్ వ్యూహం. పార్టీ జెండా, అజెండా తదితర అంశాలన్నింటినీ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కనీసం 50 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేది కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. తెలంగాణకు ఆనుకుని ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లో కేసీఆర్ పార్టీ పోటీ చేయనుంది.
తన పార్టీ నేరుగా పోటీ చేయడంతో పాటు అవసరమైన చోట ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఉత్తరాదిలో కాస్త బలంగా ఉన్న పార్టీలతో కలిసి ఉమ్మడి అజండాతో ముందుకెళ్లేలా కేసీఆర్ స్కెచ్ వేశారు. ముఖ్యంగా రైతు సమస్యలను ప్రధాన అంశంగా చేర్చుకోబోతున్నారు. ఉత్తరాదిలో రైతు సంఘాలు యాక్టివ్ గా ఉన్నాయి. అలాంటి సారూప్యత ఉన్న సంఘాలు, పార్టీలతో కలిసి ఎక్కడ వీలైతే అక్కడ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
కొత్త పార్టీలో దళిత, బీసీ వర్గాలకు పెద్దపీట వేసేలా కనిపిస్తున్నారు కేసీఆర్. దేశంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దళిత, బీసీ వర్గాలకే పదవులు కట్టబెడతామని ప్రచారం చేయనున్నారు. అంతేకాక 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవనేది కేసీఆర్ ఆక్షేపణ. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాభివృద్ధిని పక్కన పెట్టి కార్పొరేట్లకు వంత పాడాయని.. వారికి చరమగీతం పాడాలని కేసీఆర్ పిలుపునిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మౌలిక సదుపాయైన సాగునీరు, తాగునీరు, విద్యుత్ లాంటి వాటికి పెద్దపీట వేస్తామని చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా పలువురు నేతలను కేసీఆర్ ఇప్పటికే కలిశారు. మమత బెనర్జీ, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రివాల్, స్టాలిన్, కుమారస్వామి, ఉద్ధవ్ ఠాక్రే.. లాంటి నేతలతో సమావేశమై బీజేపీయేతర అజెండాను వారికి వివరించారు. వారంతా తనతో కలిసి వస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ ప్రకటించిన తర్వాత ఈ నెలలో ఢిల్లీ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలందరికీ ఈ సమాశానికి ఆహ్వానం అందనుంది. అయితే ఈ సభకు ఎవరెవరు హాజరవుతారు.. కేసీఆర్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోందనేది వేచి చూడాలి.













