కర్నాటకలో హంగ్ వస్తే… కేసీఆర్ కీ రోల్..!?
కర్నాటక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు 13న వెల్లడవుతాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు నిలిచాయి. కొన్ని హంగ్ వస్తాయని తేల్చాయి. ఒకటి, రెండు మాత్రమే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఎగ్టిట్ పోల్స్ గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేం. కాంగ్రెస్ టైమ్ బాగాలేక మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే జేడీఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పటిలాగే కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారు. ఆయన ఎటువైపు వెళ్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది.
దక్షిణ కర్నాటకలో జేడీఎస్ కు మంచి పట్టుంది. ఇప్పుడు కూడా ఆ పార్టీ 20-25 స్థానాల వరకూ గెలుచుకోవచ్చని అంచనా. ఆ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. బీజేపీ, కాంగ్రెస్ లకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. అయితే ఈ రెండు పార్టీల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. అప్పుడు జేడీఎస్ చక్రం తిప్పుతుంది. గతంలో రెండు సార్లు కుమారస్వామి ఇలాగే సీఎం అయ్యారు. ఈసారి కూడా తాను కింగ్ మేకర్ కావడం ఖాయమనే ధీమాలో ఉన్నారు కుమారస్వామి. అందుకే టెన్షన్స్ అన్నీ పక్కనపెట్టి రిలాక్స్ కావడానికి సింగపూర్ చెక్కేశారు.
అయితే కర్నాటకలో హంగ్ వస్తే కేసీఆర్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీని గద్దె దించేందుకు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్.. కర్నాటకలో కూడా ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ లో ఆ పార్టీ కూడా గణనీయమైన స్థానాలే గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో కుమారస్వామి డెసిషన్ పైనే అక్కడి గవర్నమెంట్ ఆధారపడాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు కుమారస్వామిని బీజేపీకి దగ్గర కాకుండా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారనే టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని భావించాయి. అయితే చివర్లో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది. కుమారస్వామి గోడ మీద పిల్లిలాగా తనకు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఒక్కటేనని, తనకు సీఎం సీటు ఎవరిస్తే వాళ్లకు మద్దతిస్తానని చెప్పడంతో కేసీఆర్ దూరమయ్యారు. అయితే ఇప్పుడు కేసీఆర్ మళ్లీ కుమారస్వామితో రాయబారాలు నడిపిస్తారని సమాచారం. జేడీఎస్ ను ఎలాగైనా బీజేపీకి దగ్గర కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తారని, ఇందుకోసం అవసరమైతే ఆ పార్టీకి అవసరమైన ఆర్థిక సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.













