ఉద్యమించింది మహిళాలోకం..! తలవంచింది ఇరాన్ ప్రభుత్వం..!
ఇరాన్ లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. శతాబ్దాలక్రితమే ఇరాన్ మహిళలు అత్యంత చైతన్యవంతులు. ఛాందసవాద భావజాలాలకు వ్యతిరేకించిన చరిత్ర అక్కడి మహిళలకు ఉంది. అలాంటి దేశంలో ఇటీవలికాలంలో మహిళలపై క్రమశిశ్రక్షణ పేరిట కఠిన నిబంధనలు అమలు చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం. ముఖ్యంగా మహిళలందరూ హిజాబ్ ధరించాలనే నిబంధన ఆ దేశంలో అగ్గి రాజేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహిళలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చారు. వీళ్ల ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసింది. అయినా మహిళలు లెక్కచేయకపోవడం.. ప్రపంచవ్యాప్తంగా వారికి మద్దతు పెరిగిపోతుండడంతో ప్రభుత్వం దిగొచ్చింది. మోరల్ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇంతలోనే దానిపై సందిగ్ధత నెలకొంది.
ఇరాన్ లో మోరల్ పోలీసింగ్ వ్యవస్థ రద్దు అయిందా.. లేదా అనే దానిపై క్లారిటీ రావట్లేదు. ఇరాన్ లో ఆందోళనలు ఉధృతం కావడానికి మోరల్ పోలీసింగ్ వ్యవస్థే కారణం. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగానే మహిళలు వీధుల్లోకి వచ్చారు. దీన్ని రద్దు చేస్తున్నట్టు ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆదివారం ప్రకటించారు. అయితే.. ఈ విభాగానికి మాతృక అయిన అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో మహిళలు మళ్లీ వీధుల్లోకి వస్తున్నారు. హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ మూడు రోజులు గడువు ఇచ్చారు. లేకుంటా ఇరాన్ రాజధాని నగరంలోని ఆజాదీ స్క్వేర్ వద్ద బుధవారం భారీ ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇరాన్ లో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడానికి మహ్సా అమినీ అనే 22 ఏళ్ల విద్యార్థిని కారణం. సెప్టెంబర్లో హిజాబ్ కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమిస్తున్న సమయంలో మోరల్ పోలీసుల దాడిలో ఆమె చనిపోయారు. దీంతో హిజాబ్ కు, మోరల్ పోలీసింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు ఉద్యమం మొదలు పెట్టారు. హిజాబ్ ను వదిలోసి వీధుల్లోకి వచ్చారు. హిజాబ్ ను మంటల్లో వేసి తగలబెట్టారు. ప్రభుత్వ ఆంక్షలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. దీంతో ప్రభుత్వం ఆందోళనకారులపై బలప్రయోగానికి దిగింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది. అయినా ఇరాన్ మహిళలు ఎక్కడా తగ్గలేదు. ఇప్పటివరకూ జరిగిన ఆందోళనల్లో సుమారు మూడు వందల మంది చనిపోయినట్లు అంచనా.. దాదాపు 18వేల మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మహిళలు, సెలబ్రిటీలు ఇరాన్ మహిళలకు మద్దతు పలుకుతూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.
ఇరాన్ మహిళల్లో చైతన్యం ఎక్కువ. అయితే ముస్లిం ఛాందసవాద ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక మహిళలపై ఆంక్షలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా 1979 విప్లవం తర్వాత ముస్లిం మత నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిబంధన విధించింది. ప్రజల జీవన విధానాలను పరిశీలించేందుకు మోరల్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనివల్లే ఇరాన్ లో కష్టాలు మొదలయ్యాయి. చిన్న చిన్న అంశాలపట్ల కూడా కఠినంగా శిక్షలు విధించడం మొదలుకావడంతో ఇరాన్ లో తిరుగుబాటు మొదలైంది. ఎన్ని నెలలైనా ఆందోళనలు తగ్గకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మోరల్ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇప్పటికీ అధికారికంగా దీనిపై ప్రకటన రాకపోవడంతో కాస్త గందరగోళం నెలకొంది. అయితే ఒక్కటి మాత్రం నిజమైంది. ఎంతటి నియంతృత్వ పోకడలున్న ప్రభుత్వాలైనా.. ప్రజల ఆందోళనలకు దిగిరాక తప్పదని నిరూపితమైంది.













