గుజరాత్లో ట్రయాంగిల్ ఫైట్..! అయినా బీజేపీదే విజయమా..?
దేశవ్యాప్తంగా గుజరాత్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా గుజరాత్ వాసులు కావడం.. బీజేపీకి ఇది కీలకం కావడం… ఈ ఎన్నికలపై మరింత ఉత్కంఠ రేకిత్తిస్తోంది. 27 ఏళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా కచ్చితంగా తమదే విజయం అని గట్టిగా నమ్ముతోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఆప్ కూడా బరిలోకి దిగడంతో ఏదైనా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఎలా ఉంది.. ఆయా పార్టీల ప్లస్సులు, మైనస్ లు ఏంటి..?
బీజేపీకి గుజరాత్ కంచుకోట. ప్రధాని మోదీ ఇక్కడ సీఎంగా పనిచేసి ప్రధాని స్థాయికి ఎదిగారు. దీంతో గుజరాత్ పై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయ్. అందుకే ప్రధాని మోదీ కూడా గుజరాత్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. పలుమార్లు అక్కడికెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు గుజరాత్ వాసులు కూడా మోదీని చూసే ఇక్కడ బీజేపీని ఆదరిస్తారనే ప్రచారం ఉంది. ఇక్కడ సీఎం అభ్యర్థి వాళ్లకు ప్రధానం కాదు. అక్కడ పార్టీనే ముఖ్యం.. మోదీనే నాయకుడు. అందుకే మోదీనే ముందుండి బీజేపీకి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తనను చూసే ఓటేయాలని కోరుతున్నారు. తనను ఇంతటి వాణ్ణి చేసింది మీరేనని.. మీ ఆదరణ వల్లే సీఎం నుంచి పీఎంగా ఎదిగానని సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎక్కడికెళ్లికా గుజరాత్ అభివృద్ధిని మరవనని హామీ ఇస్తున్నారు. తాను ప్రధానిగా గుజరాత్ కు చేసిన మేలును పదేపదే చెప్తున్నారు.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. ఇప్పటికే 166 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇందులో 38 మంది సిట్టింగులకు సీట్లు నిరాకరించింది అధిష్టానం. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నంత పట్టు ఇప్పుడు కోల్పోయిందనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన వారిలో పలువురు బీజేపీ గూటికి చేరిపోయారు. కాబట్టి ఈసారి ఆ పార్టీకి గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రాకపోవచ్చనే ప్రచారం ఉంది. ఇందుకు ఆప్ కూడా ఒక కారణం కావచ్చనే విశ్లేషణ కూడా ఉంది. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును, అలాగే కాంగ్రెస్ అసమర్థ ఓటు బ్యాంకును ఈసారి ఆప్ ఎగరేసుకుపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆప్ కూడా గుజరాత్ లో సత్తా చాటుతామని ధీమాగా ఉంది. ఇప్పటికే 174 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పైగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో ఆప్ ను అధికారంలోకి తీసుకొచ్చిన హామీలనే ఇక్కడ కూడా గుప్పిస్తోంది ఆప్.
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-ఎన్సీపీతో కలిసి పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయామనే ఫీలింగ్ లో ఉన్నాయి ఆ రెండు పార్టీలు. ఇప్పటికే మహారాష్ట్రలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. గుజరాత్ లో కూడా ఈసారి పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లలో విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీ, ఆప్ కు మద్దతిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రూరల్ ఓటర్లనే ఎక్కువగా నమ్ముకుంది. బీజేపీ, ఆప్ లకు ధీటుగా చాపకింద నీరులా ప్రచారం సాగిస్తోంది. అందుకే బీజేపీ.. కాంగ్రెస్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయట్లేదు.
గుజరాత్ లో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈసారి కూడా బీజేపీదే అధికారం అని ప్రీపోల్ సర్వేలు చెప్తున్నాయి. ఆప్ అనుకున్నంత స్థాయిలో సత్తా చాటే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీదే రెండో స్థానమని.. అయితే గతంతో పోల్చితే ఈసారి ఆ పార్టీకి అన్ని స్థానాలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ ఓటమికి, బీజేపీ గెలుపుకు ఆప్ ఈసారి ప్రధాన కారణం కాబోతోందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి చూడాలి ఈ అంచనాలు ఏమేరకు నిజమవుతాయో..!













