ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నీరుగారిపోతోందా..? ఈడీ చేతులెత్తేస్తోందా..?
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడంతో ఇదేదో భారీ వ్యవహారమే అని అందరూ నమ్మారు. ఆయన అలా లెటర్ రాయగానే దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిపోయాయి. ముందు సీబీఐ కేసు నమోదు చేసి కేసులో కొంతమందిని అరెస్టు చేసింది. ఆ తర్వాత అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు సీబీఐ చెప్పడంతో ఈడీ రంగంలోకి దిగింది. దీంతో అటు సీబీఐ, ఇటు ఈడీ.. రెండు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశాయి. ఒకరి తర్వాత ఒకరిని అరెస్టు చేసుకుంటూ ఆప్, బీఆర్ఎస్, వైసీపీ నేతల మెడకు ఉచ్చు బిగించే ప్రయత్నం చేశాయి.
ఆప్ నేతలు సౌత్ గ్రూప్ తో కలిసి తమకు లబ్ది చేకూరేలా ఢిల్లీ లిక్కర్ పాలసీని తయారు చేశారనేది సీబీఐ ఆరోపణ. అలాగే ఈ పాలసీ అమలు చేస్తున్న క్రమంలో ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ డబ్బు ముట్టజెప్పిందని ఈడీ చెప్తోంది. రూ.30 కోట్ల రూపాయల నగదను ఆప్ కు ఇవ్వడంతో ఆ సొమ్మును గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని ఛార్జ్ షీట్ లో పేర్కొంది ఈడీ. ఈ క్రమంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, విజయ్ నాయర్, అరబిందో శరత్ చంద్రా రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి సహా పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారణ జరిపింది. దీంతో వీళ్లను కూడా త్వరలో అరెస్టు చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు.
అయితే ఇటీవలికాలంలో ఈడీ స్పీడ్ తగ్గింది. దీనిపై విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టు అనేక సందేహాలు లేవనెత్తింది. అసులు స్కాం ఎక్కడ జరిగిందో ఈడీ ఆధారాలు సమర్పించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కోట్లలో లావాదేవీలు జరిగాయన్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలేవని ప్రశ్నించింది. కోట్లలో అక్రమాలు జరిగాయని చెప్తూ.. ఆధారాలు మాత్రం లక్షల నగదు మాత్రమే ఎందుకు చూపిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ప్రచారంలో ఉన్న విషయాలను ఆధారాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. స్పష్టమైన ఆధారాలివ్వాలని తేల్చి చెప్పింది.
మరోవైపు ఈ కేసులో అరెస్టయిన వారికి ఒక్కొక్కరికి బెయిల్ లభిస్తోంది. తాజాగా శరత్ చంద్రా రెడ్డికి రెగ్యులర్ బెయిల్ లభించింది. త్వరలోనే మనీశ్ సిసోడియా కూడా బయటకు రావచ్చని సమాచారం. స్కాంకు సంబంధించిన ఆధారాలను సమర్పించడంలో ఈడీ విఫలమవుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేసు ఇలాగే కొనసాగితే కవిత అరెస్టు కాకపోవచ్చని బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. తాము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే అసలు స్కాం జరగలేదని, కేంద్ర ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. ఆధారాలను సేకరించడంలో ఈడీ విఫలమవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కాబ్టటి ఈ కేసు కూడా నీరుగారిపోవడం ఖాయమని భావిస్తున్నారు.













