కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ షురూ..!! పార్టీల్లో గుబులు..!!

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు ఎంతోమంది తలరాతలు మార్చేస్తుంటాయి. ఎన్నో రాష్ట్రాల భవిష్యత్ గతిని మలుపు తిప్పుతుంటాయి. భారతదేశంలో ఎన్నికలే అతి పెద్ద పండుగ. ఈ ఎన్నికలకోసం ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఆపసోపాలు పడుతుంటాయి. అధికారంలోకి వస్తే తలరాతే మారిపోతుంది. ఓడిపోతే మరో ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అలాంటి అరుదైన రోజుకోసం రాజకీయ పార్టీలన్నీ ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఆరోజు రానే వచ్చింది. రేపటి కౌంటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలై పోయింది. జడ్జిమెంట్ డే కౌంట్ డౌన్ మొదలయిపోవడంతో తమ రాత ఎలా ఉంటుందోనని పార్టీలన్నీ ఆందోళన చెందుతున్నాయి. కొంతమంది నేతలు గెలుపుపై ధీమాగా ఉంటే మరికొందరేమో గెలుస్తామో లేదోననే భయంతో వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఈసారి మళ్లీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కోడై కూశాయి. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమాతో వచ్చే వంద రోజుల్లో ఏం చేయాలనేదానిపై బీజేపీ అప్పడే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై దేశంతో పాటు విదేశాల్లోని తెలుగు వాళ్లంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు టీడీపీ నేతృత్వంలోని కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని సంస్థలు వైసీపీకి పట్టం కట్టాయి. దీంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పినట్లు ఏపీ విషయంలో ఏ పార్టీకీ సర్వేలు పట్టం కట్టలేదు. మిశ్రమ ఫలితాలనిచ్చాయి. దీంతో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోతున్నాయి.
మొత్తానికి మరో 24 గంటల్లో దేశం మరో ఐదేళ్లపాటు ఎటు వెళ్తుందనేది తేలిపోనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పగ్గాలు చేపడతారనే దానిపై క్లారిటీ రానుంది. అయితే బెట్టింగ్ రాయుళ్లు, పార్టీల నేతలు మాత్రం ఈ లోపు నిద్రలేని రాత్రులు గడిపేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు అతిపెద్ద ప్రజాస్వామ్య పండగను ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది.