ఢిల్లీ లిక్కర్ స్కాం ఛార్జ్ షీటులో సంచలన అంశాలు..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజురోజుకూ కీలక మలుపు తిరుగుతోంది. ఢిల్లీలో లిక్కర్ షాపులను మేనేజ్ చేసేందుకు సౌత్ గ్రూప్ పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పిందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ వ్యవహారంలో ఎవరెవరు పాత్రధారులు.. ఎవరు సూత్రధారులు.. అనే అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈ స్కాంను వెలుగులోకి తెచ్చిందని మొదట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసును తవ్వేకొద్దీ దీని మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని తేలింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు కూడా ఈ లిక్కర్ స్కాంలో సంబంధాలున్నాయనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికే ఈ కేసులో కవితను సీబీఐ ఒక దఫా విచారించింది. మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన ఛార్జ్ షీటులో అనేక సంచలన విషయాలు ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీటు ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. లంచాలను కిక్ బ్యాక్స్ మార్గంలో తరలించారని సీబీఐ వెల్లడించింది. అభిషేక్ బోయినపల్లి నుంచి 30 కోట్ల నగదు హవాలా మార్గంలో తరిలినట్లు తేల్చింది. ఇదంతా 2021 జులై – సెప్టెంబర్ మధ్య అడ్వాన్స్ గా చెల్లించినట్లు సీబీఐ ఛార్జ్ షీటులో వెల్లడించింది. ఈ మొత్తాన్ని దినేశ్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు అందించినట్లు తెలిపింది. సౌత్ గ్రూపుకు చెందిన లిక్కర్ ప్రొడ్యూసర్స్ తరపున అభిషేక్ బోయినపల్లి ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపినట్లు సీబీఐ ఛార్జ్ షీటులో వెల్లడించింది.
సౌత్ గ్రూపును అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంట్రోల్ చేశారని ఇప్పటికే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడించింది. ఇప్పుడు సీబీఐ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. సీబీఐ ఛార్జ్ షీటును ఆమోదించిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. సమన్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉత్తర్వ్యుల్లో కీలక అంశాలు ప్రస్తావించారు. మద్యం ఉత్పత్తిదారులు, హోల్ సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు.. ఇలా ఏ ఇద్దరిమధ్యా గుత్తాధిపత్యం ఉండకూడదని.. గ్రూపులు కట్టి మేనేజ్ చేసే వీలు ఉండకూడదనేలా విధానం రూపొందించినట్లు తెలిపారు. అయితే లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలోనే నిందితులు కుట్రకు పాల్పడినట్లు తేల్చారు.
అభిషేక్ బోయినపల్లి ద్వారా అమిత్ అరోరాకు.. ఆయన నుంచి విజయ్ నాయర్ కు నగదు ముట్టింది. విజయ్ నాయర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు దీన్ని వాడుకున్నట్టు ఛార్జ్ షీటులో వెల్లడించింది సీబీఐ. హోల్ సేల్ వ్యాపారులు 12 శాతం లాభాలు ఆర్జించేలా విధానం రూపొందించారు. అందులో 6 శాతం మళ్లీ అభిషేక్ బోయినపల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేసినట్లు తెలిపింది. హోల్ సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్ కు రూ.4756 కోట్లు అందినట్లు సీబీఐ తెలిపింది. గౌతమ్ అకౌంట్ నుంచి అభిషేక్ బోయినపల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్ ఫర్ అయిందని వెల్లడించింది.
ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ముత్తా గౌతమ్ కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత నగదు బదిలీ అయిందని సీబీఐ ఛార్జ్ షీటులో పేర్కొంది. మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రలకు పాల్పడినట్లు ఆరోపించింది. కొంతమంది ప్రజా సేవకులు ఇతర సంస్థలతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడించింది. మరి ఈ వ్యవహారం మున్ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













