గుజరాత్లో బీజేపీ ఘన విజయానికి కలిసొచ్చిన అంశాలేంటి..?
వరుసగా 7 సార్లు ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. గతంలో పశ్చిమ బెంగాల్లో జ్యోతిబసుకు మాత్రమే ఇది సాధ్యమైంది. కానీ ఆ రోజులు వేరు.. ఇప్పుడు కాలం మారింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. వాళ్లకు తగ్గట్టు దశాబ్దాలపాటు పరిపాలన సాగించడం అంటే మామూలు విషయం కాదు. కానీ గుజరాత్ లో అదే జరుగుతోంది. వరుసగా ఏడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కుటుంబ పార్టీలు లేవు. వారసత్వంగా వస్తున్న ముఖ్యమంత్రులు లేరు. మరి ఇలాంటి చోట బీజేపీ ఎలా విజయం సాధించగలుగుతోంది.. ఇది ఎవరి ఘనత..?
గుజరాత్ లో మళ్లీ బీజేపీ విజయం సాధిస్తుందని మొదటి నుంచి ప్రీపోల్ సర్వేలు చెప్తూనే వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే అంచనా వేశాయి. అయితే 150 సీట్లకు మించి సీట్లు సాధించి విజయం దక్కుతుందని మాత్రం చెప్పలేకపోయాయి. గుజరాత్ లో ఈ స్థాయి విజయానికి మోదీనే ఏకైక కారణం అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ క్రెడిట్ అంతా మోదీదే అని ఆ పార్టీ నేతలు కూడా పదే పదే చెప్తున్నారు. ఆయనే ముందుండి పార్టీని నడిపించారు. ముఖ్యంగా ఆయన నిర్వహించిన ప్రచారం గుజరాత్ లో కమలాన్ని గెలుపు తీరాలకు చేర్చింది.
సాధారణంగా అధికారంలో ఉండే పార్టీలు ఎన్నికలను రెఫరెండంగా భావించేందుకు వెనుకాడుతుంటాయి. కానీ గుజరాత్ లో మోదీ మాత్రం ఈ ఎన్నికలు బీజేపీకి రెఫరెండమే అని ప్రకటించారు. గుజరాత్ లో అభివృద్ధి జరగిందని భావిస్తేనే బీజేపీకి ఓటేయాలని సూచించారు. వాస్తవానికి మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ లో అభివృద్ధి మరో స్టేజ్ కు వెళ్లింది. పలు పరిశ్రమలు గుజరాత్ కు వచ్చాయి. ఈ విషయంలో మోదీపై విపక్షాలు అనేక విమర్శలు కూడా గుప్పించాయి. మోదీ దేశానికి కాకుండా గుజరాత్ కు ప్రధానిలా వ్యవహరిస్తున్నారని.. గుజరాత్ అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తున్నారని విమర్శించాయి. అయినా మోదీ పట్టించుకోలేదు. అభివృద్ధిలో గుజరాత్ ను మోడల్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. అదే సమయంలో.. ఈ సారి గెలిచే పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని.. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటేయాలని మోదీ ప్రజలను కోరారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఈ ఐదేళ్లకు పరిమితం కాదన్నారు. ఈ రెండు అంశాలు ఓటర్లపై బాగా ప్రభావం చూపించినట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోంది.
దేశమంతా గుజరాతీయుల చేతుల్లో ఉందని విపక్షాలు పదేపదే విమర్శిస్తున్నాయి. కానీ గుజరాత్ వాసులు మాత్రం దీన్ని గర్వంగా భావిస్తున్నారు. మోదీ, అమిత్ షా లాంటి నేతలు గుజరాత్ నుంచి వెళ్లి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. అదే సమయంలో గుజరాత్ అవసరాలను తీరుస్తున్నారు. గుజరాతీయులకు మోదీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుజరాతీయులంతా గర్వంగా ఫీలవుతున్నారు. ఇప్పుడు జనం మోదీ వైపు నిలబడడానికి ఇది కూడా ఒక కారణం.
గుజరాత్ లో అంతా మంచే జరుగుతోందని చెప్పలేం. అక్కడా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. భూపేంద్ర పటేల్ సీఎం అయ్యాక అనేక అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. అయితే ఎన్నికల్లో మోదీ హవా ముందు అవన్నీ నిలబడలేకపోయాయి. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే మోర్బీలో బ్రిడ్జి కూలి సుమారు 150 మంది కూలిపోయారు. ఇది బీజేపీకి కచ్చితంగా నెగెటివ్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మోర్బీలో కూడా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీన్నిబట్టి అక్కడ మోదీ తప్ప మరో పదం వినింపించటం లేదు.. అక్కడి ప్రజలకు కనిపించడం లేదు.
గతంలో ఎన్నికలు అయ్యాకే బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించేది. కానీ ఈసారి మాత్రం మళ్లీ భూపేంద్ర పటేలే సీఎం అని ముందే ప్రకటించింది కమలం పార్టీ అధిష్టానం. వాస్తవానికి పాటీదార్ ఉద్యమం బీజేపీకి పెద్ద సవాల్ గా మారింది. పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న పటేళ్లు దూరమవుతారని భయపడింది. అయితే పాటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ చివరి నిమిషంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇది ఆ పార్టీకి పెద్ద ప్లస్ అయింది. అంతేకాక పటేళ్ల మనసు గెలుచుకునేందుకు భూపేంద్ర పటేలే మళ్లీ సీఎం అభ్యర్థి అని ప్రకటించింది. ఇది కూడా బీజేపీకి కలిసొచ్చింది. మొత్తంగా చూస్తే మోదీ అన్నీ తానై వ్యవహరించి గుజరాత్ లో కమలాన్ని విజయతీరాలకు చేర్చారని చెప్పొచ్చు.













