కర్నాటకలో బీజేపీ పరిస్థితి తారుమారు!?
కర్నాటకలో ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా ట్రై చేస్తోంది. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించినా మొదట అధికారం దక్కించుకోలేకపోయింది కమలం పార్టీ. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నాయి. తన కంటే తక్కువ సీట్లు వచ్చినా.. జేడీఎస్ నేత కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. అయితే ఇది కాంగ్రెస్ లో అసంతృప్తికి కారణమైంది. ఏడాది తిరిగేలోపే కాంగ్రెస్ లో పలువురు నేతలు బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. చివరకు కాంగ్రెస్ నుంచి వేరుపడి బీజేపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ – జేడీఎస్ సర్కార్ కుప్పకూలింది. బీజేపీ మళ్లీ పగ్గాలు చేపట్టింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే.. బీజేపీ ప్రభుత్వం కూడా సాఫీగా సాగలేదు. కొంతకాలానికే ముఖ్యమంత్రి యడ్యూరప్పను తప్పించింది బీజేపీ అధిష్టానం. ఆ స్థానంలో యడ్యూరప్ప ముఖ్య అనుచరుడు బసవరాజ్ బొమ్మైని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఇది యడ్యూరప్పకు ఏమాత్రం రుచించలేదు. తనను ఉన్నఫళంగా తప్పించడంపై ఆగ్రహంతో రగిలిపోయారు. ఆయన అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుంది బీజేపీ హైకమాండ్. కానీ రాష్ట్రంలో ఎలాంటి పరపతి లేకపోవడంతో యడ్యూరప్ప ఇప్పటికీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు డుమ్మా కొట్టారు. తాజాగా హుబ్లిలో ప్రధాని మోదీ పర్యటనలో కూడా యడ్యూరప్ప కనిపించలేదు. దీంతో యడ్యూరప్ప తీరు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
దక్షిణ భారతదేశంలో బీజేపీకి మంచి పట్టున్న రాష్ట్రం కర్నాటక మాత్రమే. ఇక్కడ రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్నాటకలో బీజేపీ బలంగా ఉండడానికి యడ్యూరప్పే కారణం. యడ్యూరప్ప లేని బీజేపీని కర్నాటకలో ఊహించడం కష్టం. అలాంటి యడ్యూరప్పనే తప్పించి వేరే వారికి పగ్గాలివ్వడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. అయితే యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయినా యడ్యూరప్పకు రాష్ట్రవ్యాప్తంగా అనుచరగణం ఉంది. కంటి చూపుతో శాసించగల సత్తా యడ్యూరప్పకు ఇప్పటికీ ఉంది.
ఇప్పుడు ఎన్నికలు మళ్లీ సమీపించాయి. దీంతో యడ్యూరప్ప ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. తన రాజకీయ జీవితానికి ఎవరూ ఫుల్ స్టార్ పెట్టలేరని ఇటీవల యడ్యూరప్ప చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పార్టీపైన, సీఎం బస్వరాజ్ బొమ్మై పైన యడ్యూరప్ప ఆగ్రహంతో ఉన్నారని అర్థమైంది. బీజేపీలోని అంతర్గత విభేదాలు కచ్చితంగా ఈసారి పార్టికి నష్టం చేకూరుస్తాయని స్పష్టమవుతోంది. పైగా యడ్యూరప్ప లింగాయత్ వర్గానికి చెందిన నేత. కర్నాటకలో లింగాయత్ సామాజిక వర్గాన్ని కాదని రాజకీయం చేయడం అసాధ్యం. యడ్యూరప్ప సహకరించకపోతే లింగాయత్ వర్గం బీజేపీకి దూరం కావడం ఖాయం. అదే జరిగితే పార్టీ ఓడిపోక తప్పదు.
ఇప్పటికే కర్నాటకలో కాంగ్రెస్ బలపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ పైన సీబీఐ, ఐటీ దాడులతో కక్షసాధిస్తోంది. మరోవైపు నాడు బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు మళ్లీ హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసొస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ అంతర్గత విభేదాలతో సతమతం అవుతోంది. యడ్యూరప్ప పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. సీఎం బస్వరాజ్ బొమ్మైపై కమిషన్ సీఎంగా ముద్ర పడింది. అవినీతి ఆరోపణలు తారస్థాయికి చేరాయి. మరోవైపు పార్టీ సస్పెండ్ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి కనీసం 30 స్థానాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశాలన్నీ బీజేపీకి మైనస్ గా మారాయి.













