విపక్షాల్లో విభజనాస్త్రం… వచ్చే ఎన్నికలు బీజేపీ మాస్టర్ ప్లాన్..!?
సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే రెండు దఫాలు అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ మరో దఫా కూడా పీఎం పీఠాన్ని దక్కించుకోవాలని గట్టిగా ట్రై చేస్తోంది. గతంతో పోల్చితే ఈసారి సీట్లు భారీగా తగ్గుతాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనదైన వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ అగ్రనాయకత్వం. ఇప్పటికే తమ వ్యూహాలతో పలు రాష్ట్రాలను కైవసం చేసుకున్న కమలదళం.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు భారీ స్కెచ్చే వేస్తోంది. వేయడం మాత్రమే కాదు.. ఇప్పటికే అమలు చేస్తోందని ఇప్పుడిప్పుడే విపక్షాలకు అర్థమవుతోంది. విపక్షాలు తేరుకునే లోపే చాపకిందకు నీరు తేవడం బీజేపీ ప్లాన్. ఇప్పుడు అదే జరుగుతోంది.
విపక్షాల బలహీనతలను సొమ్ము చేసుకోవడం ద్వారా లబ్ది పొందాలనేది బీజేపీ ప్లాన్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని జాతీయ, ప్రాంతీయ పార్టీల్లోని అసమ్మతిని క్యాష్ చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది ఆ పార్టీ. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అసోం.. లాంటి రాష్ట్రాల్లో కమలం పార్టీకి అధికారం ఇలాగే దక్కింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ లోని పార్టీలపై బీజేపీ కన్నేసింది.
రాజస్థాన్లో ఇటీవల సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని నిరసన సభ నిర్వహించారు. ఈ ఏడాదే రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో సచిన్ పైలట్ తిరుగుబావుటా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ కూటమికి బీటలు వారుతున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీలో అజిత్ పవార్ అడుగులు ఆ పార్టీలో కంగారు పుట్టిస్తున్నాయి. ఎన్సీపీలో 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారని సమాచారం. వీళ్లంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోనే అజిత్ పవార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. ఏక్ నాథ్ షిండేతో పెద్దగా ప్రయోజనం ఉండట్లేగని గ్రహించిన బీజేపీ.. మరాఠాల మనసు గెలిచేందుకు అజిత్ పవార్ ను వాడుకోవాలనుకుంటోంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. మమత బెనర్జీ ముఖ్య అనుచరుడు సువేందు అధికారిని లాగినా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే మరోసారి ఆ పార్టీ పని పట్టేందుకు ప్రయత్నిస్తోంది. టీఎంసీ సీనియర్ నేత ముకుల్ రాయ్ ని మరోసారి పార్టీవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఒకసారి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్.. తిరిగి సొంతగూటికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ మూడు రాష్ట్రాల్లోని అసంతృప్త నేతలంతా బీజేపీ ఆడిస్తున్నట్టు ఆడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఈ పార్టీలన్నీ బలంగా ఉన్నాయి. వీటిని చీల్చితే తమ పని సులువు అవుతుంది. చీల్చడం ద్వారా ఆయా పార్టీలు తమతో కలసిరావడానికి సిద్ధపడతాయి.. లేకుంటే చీలికవర్గం నేత తమతో కలుస్తారు. అప్పుడు ఆ పార్టీ వీక్ అవుతుంది. తమకు కావాల్సింది కూడా అదే. ఎలాగైనా లబ్ది పొందాలి. ప్రత్యర్థి పార్టీలు ఏమైపోయినా పర్లేదు. ఇదే వ్యూహంతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది బీజేపీ. ఇప్పటికే ఆ మేరకు కార్యాచరణ మొదలు పెట్టేసింది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఎన్ని పార్టీలు బీజేపీకి దాసోహం అంటాయో వేచి చూడాలి.













