బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే ఎంఐఎం పనిచేస్తోందా..?
రాజకీయం అంటేనే ఎత్తులు, పైఎత్తులు. పార్టీలన్నీ తమ లబ్ది కోసం ఇతర పార్టీలపై వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని పార్టీలను కూడా పావులుగా వాడుకుంటూ ఉంటాయి. ఇందులో బీజేపీ ముందుంటుందనేది విశ్లేషకులు చెప్పే మాట. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి చిన్నాచితకా పార్టీలు కూడా బీజేపీతో సఖ్యత కోరుకుంటాయి. లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాయి. ఎంఐఎం పార్టీ కూడా బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు పనిచేస్తోందనే విమర్శ దేశవ్యాప్తంగా బలంగా ఉంది.
ఎంఐఎం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ. హైదరాబాద్ పాతబస్తీలో మొదలైన ఎంఐఎం ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునే స్థాయికి ఎదిగింది. హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ దశాబ్దాలుగా విజయం సాధిస్తూ వస్తున్నారు. పాతబస్తీ ఓటర్లే ఆయనకు జీవితకాల మద్దతుదారులు. ఇక్కడ ముస్లింలదే ఆధిపత్యం. కాబట్టి ఇక్కడ ఓవైసీని ఓడించే మగాడెవరూ ఇంతవరకూ రాలేదు. ఇదే స్ట్రాటజీతో ముస్లింల ప్రభావం అధికంగా ఉండే చోట్ల ఎంఐఎం పోటీ చేస్తూ తన ప్రాభవం పెంచుకునే ఆలోచనలో ఉంది.
ఒకప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఎంఐఎం ఆ తర్వాత మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్.. లాంటి రాష్ట్రాల్లో కూడా పోటీ చేసింది. ఒకటిరెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లను కూడా కైవసం చేసుకుంది. అయితే బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే ఎంఐఎం ఈ రాష్ట్రాల్లో పోటీ చేసిందనే విమర్శలు ఉన్నాయి. బీజేపీయేతర ప్రతిపక్షం బలంగా ఉన్న చోట్ల మాత్రమే ఎంఐఎం పోటీ చేసి ఓట్లను చీల్చుతుంది. అప్పుడు బీజేపీకి లాభం చేకూరుతుంది. ఇదే ఎంఐఎం స్ట్రాటజీ. బీజేపీ బలంగా ఉన్న చోట మాత్రం పోటీ చేయట్లేదు.. అనే ఆరోపణలున్నాయి.
ఇప్పుడు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించింది. 40 చోట్ల పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీని ఓవైసీ వెల్లడించారు. అయితే ఎంఐఎం పోటీ చేయాలనుకున్న 40 స్థానాల్లో 29 స్థానాల్లో ఇప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఇవి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు. ఇలాంటి చోట ఎంఐఎం పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లింలు చీలిపోతారు. ఓట్లు చీలి బీజేపీకి లబ్ది చేకూరుతుంది. ఇందుకోసమే రాజస్థాన్లో ఎంఐఎం పోటీ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు కొత్త కాదు. కానీ ఓవైసీపీ మాత్రం ఎప్పుడూ వీటిపై స్పందించరు.













