ముందే మేల్కొన్న బీజేపీ..! ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కసరత్తు..!!
భారతీయ జనతా పార్టీ ఈసారి ముందే మేల్కొంది. సాధారణంగా ఏదైనా రాష్ట్రానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అలా జరగట్లేదు. నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎన్నికల కమిటీ సమీక్షిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలలు ముందే ఎన్నికలపై సమీక్షిస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఓడిపోతామనే భయమా.. ముందు జాగ్రత్తా… అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మిజోరాం మిగిలినవన్నీ కీలక రాష్ట్రాలే. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ తో కలిపి అధికారాన్ని పంచుకుంది. అయితే మణిపూర్ పరిణామాల నేపత్యంలో మిజోరం నేషనల్ ఫ్రంట్ కు, బీజేపీకి మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఐదింటిని సొంతంగా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే మూడు నెలలు ముందుగానే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మోదీ, అమత్ షా, రాజనాథ్ సింగ్ తదితరులు కీలకంగా ఉన్నారు. అంతేకాక ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల కీలక నేతలు కూడా ఇందులో ఉంటారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా ఈ సమాశం ఉంటుంది. రాష్ట్రాల వారీగా నేతలతో సమావేశమై అక్కడి పరిస్థితులు, గెలుపు అంచనాలు, సీట్ల వారీగా సర్వేలు.. లాంటి అంశాలన్నింటిపైనా బేరీజు ఉంటుంది. ప్రధానంగా బలహీనంగా ఉండే స్థానాలపైనే బీజేపీ ఈసారి దృష్టి పెట్టబోతోంది. అప్పుడే పార్టీ బలపడేందుకు, మరిన్ని స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుందనేది బీజేపీ అంచనా.
మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై బీజేపీ హైకమాండ్ పూర్తి నమ్మకంతో ఉంది. చౌహాన్ నేతృత్వంలో మరోసారి అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ఉంది. ఇక రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలున్నాయి. అవి తమకు లబ్ది చేకూరుస్తాయని భావిస్తోంది. చత్తీస్ గఢ్ లో త్రిముఖ పోటీ తప్పదని భావిస్తున్నారు. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ చెప్తోంది. కానీ ఆ పార్టీకి అంత సత్తా లేదని తాజా అంచనాలు చెప్తున్నాయి. మిజోరంలో ఏం జరుగుతుందనేది మణిపూర్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఫైట్ చేయాలని భావిస్తోంది బీజేపీ.













