ఏపీ, తెలంగాణలో కేసులు ఎప్పుడు విజృంభిస్తాయంటే..?
కరోనా సెకండ్ వేవ్ మరింత స్పీడ్ అందుకుంటోంది. రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలు దాటిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశంగా రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 22లక్షల 91వేలకు పైగా ఉన్నాయి. ఇదే తీవ్రత కొనసాగితే మున్ముందు మరింత భయానక పరిస్థుతులు తప్పకపోవచ్చు.
ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు భారీగా పెరిగిపోయింది. పరీక్షించిన ప్రతి వందమందిలో 25 మందికి పాజిటివ్ రిజల్ట్ వస్తోంది. ఇది రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ వేవ్ ఇలాగే కొనసాగితే వచ్చేనెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని కాన్పూర్ ఐఐటీ అంచనా వేసింది. మే 11 నుంచి 15 మధ్య కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరుతుందని లెక్కగట్టింది. అప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు చేరుతుందని తేల్చింది.
గతేడాది ఫస్ట్ వేవ్ లో సెప్టెంబరు 17న 10లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు నమోదవుతున్న ఈ యాక్టివ్ కేసులు అంతకు మూడు రెట్లు ఎక్కువ. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తుండమే కేసుల పెరుగుదలకు కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కరోనా తొలి దశతో పోలిస్తే రెండో దశలో వైరస్ వ్యాప్తి రెట్టింపు కంటే ఎక్కువగా ఉందన్నారు. కొత్త కేసుల్లో 76.32శాతం మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్‌లో నమోదవుతున్నాయని తెలిపారు. మొత్తం మరణాల్లో 82.6శాతం మరణాలు పది రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి.
ఇప్పుడు నమోదవుతున్న రేంజ్ లోనే కేసులు నమోదైతే.. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణలో ఏప్రిల్ 25-30 మధ్య కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. మే 1 నుంచి 5 మధ్య ఒడిశా, కర్నాటక, పశ్చిమ బెంగాల్లో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంటుందన్నారు. మే 6 నుంచి 10 మధ్య తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ అధ్యయనంలో మహారాష్ట్రకు, చత్తీస్‌గఢ్‌కు కొంచెం శుభవార్త చెప్పారు శాస్త్రవేత్తలు. భారీగా కేసులు నమోదవుతున్న ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాప్తి తీవ్రస్థాయికి చేరిందని.. ఇకపై అక్కడ కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పారు.
మే 1 నుంచి మే 5 మధ్య రోజుకు 3లక్షల 30వేల నుంచి 3లక్షల 50వేల కొత్త కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. పది రోజుల్లో వైరస్ తీవ్రత మరింత ఎక్కువై యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35లక్షలకు చేరుతుందని తెలిపారు.













