చిన్న మధ్యతరహా సంస్థలను ప్రోత్సహిస్తున్న జగన్ ప్రభుత్వం
పదేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు రాష్ట్రంలో తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునే విధంగా సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నాటి నుంచి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బ్యాంకు రుణాలను చెల్లించలేక ఎన్పీఏలుగా మారిపోయిన యూనిట్లను ఆదుకోవడానికి ‘వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు లేక, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని రక్షించేందుకు తక్షణం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద గత ప్రభుత్వం బకాయిపడ్డ రాయితీలతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సిన రాయితీలు కలిపి రూ.905 కోట్లు విడుదల చేయడం ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న ఎంఎస్ఎంఈలకు ఆక్సిజన్ అందించినట్టయ్యిందని చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా ఏపీ ప్రభుత్వం ఒక్క ఏడాది బకాయి కూడా లేకుండా చెల్లించిందని వారు పేర్కొన్నారు.
రూ.188 కోట్ల స్థిర విద్యుత్ డిమాండ్ చార్జీల భారాన్ని మాఫీ చేయడం, వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడం, ప్రభుత్వ శాఖలు చేసే కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంఎస్ఎంఈలకు కొండంత భరోసానిచ్చింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 78,634 యూనిట్లకు రూ.2,079.23 కోట్ల రుణాన్ని మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 33,574 యూనిట్లకు రూ.1,269.91 కోట్ల రుణాలు అందించారు.
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను నిరంతరం పర్యవేక్షించే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎంఎస్ఎంఈలకు పరిశ్రమ ఆధార్ ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయిలో డేటాబేస్‌ను తయారు చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా ఏపీఐఐసీ ప్లగ్ అండ్ పే విధానంలో వినియోగించుకునే విధంగా 31 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు.
వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చాం- సిఎం జగన్
రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాలుగా మేలు చేసేలా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని, రైతులందరికీ ఉచితంగా వైయస్ఆర్ పంట బీమా అమలు చేస్తున్నామని ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పంట వేసే సమయం నుంచి కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాలు అన్నదాతకు అండగా ఉంటాయన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 2018-19కి సంబంధించిన రబీ పంట బీమా సొమ్ము రూ.596 కోట్ల చెల్లించడం జరిగిందన్నారు. దీని ద్వారా 5.94 లక్షల మంది రైతులకు మేలు చేకూరిందని చెప్పారు.
2018కి సంబంధించిన రబీ పంట బీమా సొమ్ము రూ.596 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని కలెక్టరేట్లో ఉన్న రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడారు.
మామూలుగా అయితే ఇన్సూరెన్స్ సొమ్ము రైతు చెల్లించిన తరువాత మిగిలిన ప్రీమియం స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సగంగా చెల్లించాలి. పంటల సీజన్ ప్రారంభమయ్యే నెలన్నర సమయానికి అయినా చెల్లిస్తేనే రైతుకు ఇన్సూరెన్స్ కరెక్టుగా అందుతుంది. 2018-19కి సంబంధించిన ఇన్సూరెన్స్ కేంద్రం తన వాటా చెల్లించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చెల్లించే ప్రీమియం రూ.126 కోట్లు గత ప్రభుత్వం కట్టలేదు. దీంతో రైతులకు ఇన్సూరెన్స్ అందని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని మార్చుతూ.. రైతులకు జరిగిన నష్టం చాలా ఎక్కువగా ఉందని, సాయం అందించాలని ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు జరిపాం. రూ.126 కోట్లు చెల్లించామని జగన్ చెప్పారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఇన్స్యూరెన్స్ విధానంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఒక్క రూపాయి కడితే చాలు..
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాపింగ్ చేయిస్తున్నాం. రైతు భరోసా కేంద్రంలో ఉన్న వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్, గ్రామ సచివాలయంలోని రెవెన్యూ అసిస్టెంట్ ముగ్గురు కలిసి రైతు వేసే పంటలకు ఈ-క్రాపింగ్ నమోదు చేస్తారు. ఈ -క్రాపింగ్ నమోదైన వెంటనే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. రైతు మీద భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఇన్సూరెన్స్ కోసం రైతు కేవలం ఒక్క రూపాయి కడితే చాలు మిగిలిన భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
పంట పెట్టుబడి కోసం రైతు భరోసా పథకం అమలు చేయడం నుంచి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం, ఈ-క్రాపింగ్ చేయించడం, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ జరిగించడం, పంట రుణాలను అందించడం, రైతులకు క్వాలిటీతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రైతుకు ఏ పంట వేయాలని సూచన చేయడమే కాకుండా, చివరకు పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించే దిశగా ఆర్బీకేలు, రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జగన్ పేర్కొన్నారు.
రైతు మేలు జరిగే విధంగా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చామని సగర్వంగా మీ బిడ్డగా చెప్పగలుగుతున్నాను. దేవుడి దయ, మీ అందరి దీవెనలతో ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఈ పంట బీమా సొమ్ము కూడా బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా కలెక్టర్లు, అధికారులు బ్యాంకర్లతో మాట్లాడాలి’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చారు.













