ప’వార్’ ఫ్యామిలీ పొలిటికల్ ఫైట్
బాబాయ్ శరద్ పవార్ పై ఇప్పటికే రాజకీయంగా పైచేయి సాధించిన అబ్బాయ్ అజిత్ పవార్..ఇప్పుడు మరోసారి గట్టిదెబ్బే కొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటైన బారామతిపై .. పట్టుసాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బారామతి స్థానానికి పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అజిత్ పవార్ సతీమణి సునేత్ర కూడా ఇక్కడినుంచే పోటీచేసే అవకాశాలున్నట్టు రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది. శుక్రవారం అజిత్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు దోహదం చేస్తున్నాయి.
సుప్రియా సూలే బారామతి సిట్టింగ్ ఎంపీ. 2009 నుంచి అక్కడ విజయం సాధిస్తున్నారు. ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయని వారిని ఆమెపై బరిలోకి దింపుతామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. మొదటిసారి పోటీ చేసే అభ్యర్థిని గెలిపించాలని, అభివృద్ధికి ఓటేయాలని అభ్యర్థించారు. దాంతో ఆయన సతీమణినే బరిలో దింపుతారనే వార్తలు మొదలయ్యాయి. తదుపరి లోక్సభ ఎంపీ అంటూ ఇటీవల సునేత్ర పవార్ పేరిట కొన్ని బ్యానర్లు వెలిశాయి. అది కూడా ప్రస్తుత వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని సునేత్ర పవార్.. ఎన్విరాన్మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా అనే ఎన్జీఓను నెలకొల్పి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.
విద్యా ప్రతిష్ఠాన్ విద్యాసంస్థకు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. గతేడాది జులైలో ఎన్సీపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ- శిండే సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత నుంచి శరద్ పవార్ ఎన్సీపీపై క్రమంగా పట్టు కోల్పోతూ వచ్చారు. దీనికితోడు అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించింది ఈసీ. పవార్ వర్గానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్ అనే పేరు కేటాయించింది. ఈసీ ఆదేశాలను సీనియర్ పవార్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.













