Sydney Shooting: ప్రాణాలకు తెగించి.. పలువురిని కాపాడిన సిడ్నీ హీరో!
కళ్లముందు అత్యంత భయంకరమైన ఉగ్రవాదులు..చేతుల్లో ఆటోమేటిక్ వెపన్స్.. ఎవరైనా ఆసీన్ చూస్తే వెంటనే భయంతో పారిపోవడమో లేదంటే దాక్కోవడమో చేసేవారు.. కానీ అహ్మద్ అల్ అహ్మద్.. అలా చేయలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి పలువురిని కాపాడారు. అంతే కాదు.. నేను చచ్చిపోవచ్చు.. మనుషులను కాపాడి చనిపోతున్నానని నాకుటుంబానికి చెప్పంటూ సహచరులకు చెప్పి, ఆ భయంకరులతో పోరు సలిపారు. ఓ ఉగ్రవాదిని బలంగా పట్టుకుని ఫైట్ చేయడంతో.. ఆయుధం వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఉగ్రవాదిని ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
సిరియా నుంచి వచ్చి..
అహ్మద్ అల్ అహ్మద్ స్వదేశం సిరియా. నిత్యం అంతర్యుద్ధంతో నలిగిపోయే ఆ దేశాన్ని వీడి భవిష్యత్తుపై కలలు కంటూ దశాబ్దం క్రితం ఆస్ట్రేలియా (Australia)కు వలస వచ్చారు. కుటుంబంతో కలిసి దక్షిణ సిడ్నీలో సదర్లాండ్ షైర్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈయనకు ఇద్దరు చిన్న పిల్లలు. స్థానికంగా ఓ పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఉగ్రదాడి (Australia Terror Attack) జరిగిన ఆదివారం ఉదయం అహ్మద్ బోండి బీచ్లో తన బంధువు జోజీ అల్కాంజ్తో కలిసి కాఫీ షాప్లో ఉన్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే వీరిద్దరూ భయపడిపోయారు. కాసేపటికి అహ్మద్ తేరుకున్నారు. ఉగ్రవాదులను చూడగానే వారిని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే తన ప్రాణాలు పోతాయని తెలిసినా ఆయన వెనకడుగు వేయలేదు. ‘‘నేను చనిపోబోతున్నా. నా కుటుంబాన్ని చూసుకో. ఒకవేళ నాకేదైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు’’ అని అహ్మద్ తన బంధువుతో చెప్పారు. ఈ విషయాన్ని అల్కాంజ్ మీడియాకు వివరించారు.
ట్రంప్ ప్రశంసలు..
అహ్మద్ సాహసాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఆయన ఎంతో ధైర్యంగా ఉగ్రవాదులకు ఎదురునిలిచారని, ఆయన చేసిన పనికి చాలా గర్వపడుతున్నానని అన్నారు. అహ్మద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.






