కుష్బూ పోయే.. షకీలా వచ్చే..! కాంగ్రెస్ కు కలిసొస్తుందా..?
తమిళనాట కాంగ్రెస్ పార్టీకి చాలాకాలంగా సేవలందించారు కుష్బూ. అయితే అక్కడ ప్రాంతీయ పార్టీలదే రాజ్యం. జాతీయ పార్టీలేవైనా అక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే మనుగడ. అయితే ఒక్కోసారి రీజనల్ పార్టీలు.. ఆ జాతీయ పార్టీలను ఏమాత్రం పట్టించుకోవు. అందుకే అక్కడ జాతీయ పార్టీల నేతలకు హైకమాండ్ అండదండలుంటే చాలనుకుంటారు. ప్రజల్లో వాళ్లకు పెద్దగా పాపులారిటీ ఉండదు. అందుకే ఎన్నో ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుష్బూ.. తమిళనాడులో పెద్దగా పదవులు అందుకున్నది లేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం కూడా కుష్బూకు కలిసిరాలేదు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి జంప్ అయిపోయారు.
అయితే కుష్బూ వెళ్లిపోయాక కాంగ్రెస్ పార్టీకి గ్లామర్ కరువైంది. అయితే ఆ గ్లామర్ మరో సూపర్ పాపులర్ తారతో భర్తీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దక్షిణాది శృంగార తారగా పేరొందిన షకీలాను పార్టీలో చేర్చుకుంది. తమిళనాడు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆమె పార్టీలో చేరి సభ్యత్వం స్వీకరించారు. తమిళనాడు కాంగ్రెస్ హ్యూమన్ రైట్స్ వింగ్ లో షకీల పనిచేయనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారు. చాలా కాలంగా రాజకీయాల్లోకి రావడానికి షకీలా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లకు ఆమె ఓ వేదిక దొరికింది. షకీలా చేరిక తమకు తప్పకుండా కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు ఢంకా బజాయించి చెప్తున్నాయి. దీంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో డీఎంకే ప్రభుత్వంలో చేరే అవకాశం కనిపిస్తోంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ నేతలు పాలనలో భాగస్వాములయ్యే ఛాన్స్ రానుంది. తమిళనాడులో కాంగ్రెస్ నేతలు ఎన్నో ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఈసారి ఆ కోరిక నెరవేరుతుందని భావిస్తున్నారు.
కుష్బూ స్థానాన్ని షకీల భర్తీ చేస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. దక్షిణాదిలో షకీలా పేరు తెలియని వారుండరు. 2వందలకు పైగా సినిమాల్లో షకీలా నటించారు. 18 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ఆరంగేట్రం చేసిన షకీలా.. మళయాళంలో హీరోలకు పోటీగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య సినిమాలు తగ్గిపోయాయి. గతేడాది ఆమె బయోపిక్ కూడా రిలీజైంది. కుక్ విత్ కోమలిలో కూడా షకీలా పాల్గొన్నారు. మూవీల్లో తిరుగులేని తారగా పేరు తెచ్చుకున్న షకీలాకు ఇప్పుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.













