విపక్ష ఐక్యత సాధ్యమేనా?
పట్నా సమావేశం ముగిసి రోజులు గడవకముందే విపక్షాల ఐక్యత ఎంత సజావుగా సాగుతుందో ఆప్ తేల్చేసింది. ఢిల్లీలో ఆర్డినెన్స్ వ్యవహారంపై కాంగ్రెస్ మద్దతివ్వకపోవడంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ఆర్డినెన్స్ కు మద్దతివ్వకుంటే.. విపక్షకూటమి సమావేశాలకు దూరంగా ఉంటామని ప్రకటించిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ నేతలపైనా విమర్శలు చేశారు.ఇప్పుడు విపక్ష కూటమి అధ్యక్షుడిగా రాహుల్ ఉంటే అంగీకరించమని నేరుగా తేల్చిెచెబుతున్నారు.
దీంతో కాంగ్రెస్ సైతం కేజ్రీవాల్ తీరుపై అంతే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల ఐక్యతను వేగవంతం చేసేలా కేజ్రీవాల్ ప్రకటనలు లేవని, విపక్ష ఐక్యతా యత్నాలను దెబ్బతీసి బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు. ఆర్డినెన్స్‌పై ఓవైపు కాంగ్రెస్ సాయం ఆశిస్తున్నట్టు కనిపిస్తూనే, మరోవైపు నిస్సిగ్గుగా తమ పార్టీ చీఫ్‌లను ఆప్ అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.
కేవలం బీజేపీకి సాయపడేందుకే అవినీతి సొమ్ములను గోవా, గుజరాత్, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్, అస్సాం ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసి, కాంగ్రెస్‌ను దెబ్బతీసిందని, ఈ విషయాన్ని తాము ఎప్పటికీ మరచిపోమంటున్నారు. సామాన్య వ్యక్తినని చెప్పుకుంటూ తన కోసం విలాసవంతమైన భవనం నిర్మించుకుని రూ.171 కోట్ల ప్రజాధనాన్ని కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారని ఘాటుగా విమర్శిస్తున్నారు.
అటు ఆప్, ఇటు కాంగ్రెస్ సైతం ఢీ అంటే ఢీ అంటుండడంతో .. మిగిలిన పార్టీలు సైతం వీరి గొడవను చూస్తున్నాయి తప్ప, చల్లార్చే పనిచేయలేకపోతున్నాయి. దీంతో ఆప్ లేకుండానే కూటమి కట్టాల్సిన పరిస్థితి ఉంది. అదే జరిగితే ఆప్ .. మరికొన్ని రాష్ట్రాల్లో పోటీకి దిగుతుంది. ఫలితంగా మళ్లీ ఎక్కడికక్కడ ట్రయాంగిల్ ఫైట్ తప్పనిస్థితి కనిపిస్తోంది. మరి ఈ వివాదాన్ని కూటమి బాధ్యతలను తలనెత్తుకున్న నితీష్ కుమార్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి…













