Digvijay Singh: కాంగ్రెస్‌లో డిగ్గీ రాజా కల్లోలం..!
భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తుతం ఒక విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బయటి శత్రువుల కంటే, పార్టీ అంతర్గత నేతల వైఖరే అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ (RSS) వ్యతిరేకిగా ముద్రపడిన దిగ్విజయ్ సింగ్, హఠాత్తుగా ఆ సంస్థ పనితీరును ఉదాహరణగా చూపడం రాజకీయ వర్గాల్లోనే కాక, సొంత పార్టీలోనూ పెను దుమారం రేపుతోంది.
ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు మార్పు అంశంపై కేంద్రంపై పోరుకు సిద్ధమవుతూ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం కానున్న తరుణంలో దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పార్టీని ఇరకాటంలో నెట్టింది. “ఆర్ఎస్ఎస్లో నాయకుల పాదాల వద్ద కూర్చున్న ఓ సామాన్య కార్యకర్త.. రాష్ట్రానికి సీఎంగా, దేశానికి ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ఉన్న సంస్థాగతమైన శక్తి” అంటూ ప్రధాని మోదీ ఫోటోను జత చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్ష ప్రశంసల్లా ధ్వనించాయి. నిజానికి దిగ్విజయ్ ఉద్దేశం.. కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా అంత బలంగా తయారుకావాలని చెప్పడమే కావచ్చు. ఆ తర్వాత ఆయన.. “నేను ఆర్ఎస్ఎస్, బీజేపీలకు బద్ధ వ్యతిరేకిని” అని వివరణ ఇచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన సమయంలో, వారి సంస్థాగత నిర్మాణాన్ని కీర్తించడం ద్వారా కార్యకర్తల్లో గందరగోళం సృష్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో పలువురు సీనియర్ నేతలు బీజేపీకి, ఆరెస్సెస్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేరళకు చెందిన సీనియర్ నేత శశిథరూర్ వ్యవహారశైలిపై పార్టీలో ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. ఆయన తరచుగా ప్రధాని మోదీని ప్రశంసించడం, లేదా బీజేపీ విధానాలపై మృదు వైఖరి అవలంబించడం చర్చనీయాంశమైంది. తిరువనంతపురంలో బీజేపీ ఓటు బ్యాంకు పెరగడానికి, లేదా అక్కడ ఆ పార్టీ బలపడడానికి థరూర్ వైఖరే కారణమనే అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే ఉన్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి మాస్ లీడర్ ఏకంగా అసెంబ్లీ వేదికగా ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం ఆ మధ్య పెద్ద వివాదానికే దారితీసింది. ఇది లౌకికవాద పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమనే విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్ సీనియర్ నేతల ఈ ప్రవర్తన వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నేతలు, బీజేపీ క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను చూసి, తమ పార్టీలోని సంస్థాగత లోపాలపై అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే కోణం ఉంది. దిగ్విజయ్ వ్యాఖ్యల్లో ప్రశంస కంటే, కాంగ్రెస్ నాయకత్వానికి మేల్కొనండి అని చెప్పే హెచ్చరిక కూడా ఉండవచ్చు. రాహుల్ గాంధీ ఒకవైపు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటే, సీనియర్ నేతలు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించడం.. పార్టీలో కమాండ్ అండ్ కంట్రోల్ లోపించిందన్న సంకేతాలను ఇస్తోంది. ఇప్పటికే అనేకమంది కాంగ్రెస్ నేతలు బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు పార్టీలో ఉంటూనే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నవారు కూడా భవిష్యత్తులో గోడ దూకే అవకాశం ఉందన్న అనుమానాలు కేడర్‌ను వెంటాడుతున్నాయి.
దిగ్విజయ్ సింగ్ ఉద్దేశం ఏదైనప్పటికీ, టైమింగ్ మాత్రం పూర్తిగా బెడిసికొట్టింది. యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువు కత్తి పదునును పొగడడం సొంత సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది. బీజేపీని సిద్ధాంతపరంగా ఎదుర్కోవాల్సిన సమయంలో, కాంగ్రెస్ సీనియర్లే ఆ పార్టీ సంస్థాగత బలాన్ని కీర్తించడం, పరోక్షంగా బీజేపీ నరేటివ్కే మేలు చేస్తోంది. ఈ అంతర్గత గందరగోళాన్ని చక్కదిద్దకపోతే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది మరింత పెద్ద రాజకీయ సవాలుగా మారే ప్రమాదం ఉంది.






